సినిమా రివ్యూ: ‘కుబేర’

- June 20, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కుబేర’

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే ‘కుబేర’.స్టార్ హీరోల సినిమా.. శేఖర్ కమ్ముల దర్శకత్వం అంటే అంచనాలు బాగానే వుంటాయ్. మరి ఆ అంచనాల్ని సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే ‘కుబేర’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
దీపక్ (నాగార్జున) నిజాయితీపరుడైన సీబీఐ అధికారి. ఆయన నిజాయితీనే ఆయనకు శత్రువుగా మారుతుంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కొందరు తప్పుడు వ్యక్తుల కోసం తన నిజాయితీని పక్కన పెట్టి వాళ్ల కోసం పని చేయాల్సి వస్తుంది. అలా జైలు నుంచి బయటికి వస్తాడు దీపక్. అందులో భాగంగానే  అత్యంత విలువైన నిల్వలు కాచేయాలనుకునే పారిశ్రామిక వేత్త (జిమ్ సర్బ్) కి నాగార్జున సాయం చేయాల్సి వస్తుంది. ఇదే నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు కొందరు బినామీల ఖాతాల్లో జమ చేస్తారు. అందుకోసం ఏ అడ్రస్ ప్రూఫ్ లేని  నలుగురు బిచ్చగాళ్లను ఎంచుకుంటారు. అందులో ఒకడు దేవా (ధనుష్). మరి, ఈ లక్షల కోట్ల స్కాం బినామీలైన బిచ్చగాళ్ల ద్వారా వర్కౌట్ అయ్యిందా.? అసలు దీపక్‌కీ, దేవాకీ ఏంటి సంబంధం.? తనకు తెలియకుండానే ఈ స్కాంలో ఇరుక్కున్న దేవా ఏమయ్యాడు.? నిజాయితీనే ప్రాణంగా నమ్మిన దీపక్ ఏం చేశాడు.? కొన్ని లక్షల కోట్లు అప్పనంగా కాజేయాలనుకున్న విలన్ కోరిక నెరవేరిందా.? ప్రేమించిన అబ్బాయి మోసానికి గురైన సమీరా (రష్మిక మండన్నా) ఎవరు.?  తెలియాలంటే ‘కుబేర’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
నాగార్జునకి ఈ సినిమా మరో మంచి మైలు రాయి. వయసుకు తగ్గ పాత్ర. కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటి. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు నాగార్జున. ఇక ధనుష్ విషయానికి వస్తే.. బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటించాడు అనే కన్నా.. జీవించేశాడు అనడం సబబు. నెక్స్‌ట్ లెవల్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు ధనుష్. సమీరాగా రష్మిక మండన్నా పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. కానీ, వున్న దాంట్లో తన పాత్రకు న్యాయం చేసింది రష్మిక.నాగార్జున భార్యగా  సునయన, విలన్ పాత్రలో జిమ్ సర్బ్ చక్కగా నటించారు. మిగిలిన పాత్రధారులు పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుల్లో డిఫరెంట్ పంథా శేఖర్ కమ్ములది. ఈ సినిమా కోసం తాను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. వాస్తవానికి చెప్పాలంటే కోటీశ్వరులు, బిచ్చగాళ్లు.. ఈ కాన్సెప్ట్ పాతదే అయినా తాను రాసుకున్న కథనం ఈ సినిమాకి కొత్తగా అనిపిస్తుంది. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌ని తనదైన స్టైల్‌లో బాగా డీల్ చేశాడు శేఖర్ కమ్ముల. కానీ, క్లైమాక్స్ విషయంలో కాస్త గందరగోళానికి గురి చేశాడనిపిస్తుంది. సరైన తీర్చు ఇవ్వలేదనిపిస్తుంది. సన్నివేశాల్లో చాలా చోట్ల ‘లీడర్’ సినిమా పోలికలు అనిపిస్తాయ్. కోట్ల డబ్బును డీల్ చేసే పలు వ్యవహారాల్లో ‘లీడర్’ పోలికలు చాలా కనిపిస్తాయ్. ప్రీ క్లైమాక్స్‌లో ధనుష్ సంభాషణలు, నాగార్జున, ధనుష్ కాంబినేషన్ సన్నవిేశాలు బాగుంటాయ్. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణ. సన్నివేశానికి తగ్గట్లుగా ఇచ్చిన బీజీఎమ్ పర్‌ఫెక్ట్. సినిమా‌టోగ్రఫీ సినిమాకి మరో అస్సెట్. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. నిడివి చాలా ఎక్కుెవగా అనిపిస్తుంది. మూడు గంటల రెండు నిమిషాల నిడివి సినిమా.. చూస్తున్నంత సేపూ ముందుకు వెళుతున్నట్లుగానే అనిపిస్తుంది. బోర్ కొట్టదు కానీ, కొన్ని చోట్ల సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ ఈ సినిమాకి మంచి సపోర్ట్. 

ప్లస్ పాయింట్స్:
శేఖర్ కమ్ముల డైరెక్షన్, కాన్సెప్ట్, ధనుష్ అండ్ నాగార్జున పర్‌ఫామెన్స్.. ప్రీ క్లైమాక్స్ తదితర అంశాలు..

మైనస్ పాయింట్స్:
నిడివి, సెకండాఫ్‌లో కొన్ని రెగ్యులర్ సన్నివేశాలు, అర్ధాంతరంగా ముగిసినట్లనిపించిన క్లైమాక్స్..

చివరిగా:
కొన్ని లాజిక్స్, మరికొన్ని తప్పొప్పులు సినిమా లెంగ్త్ పక్కన పెట్టేస్తే.. అన్ని వర్గాల ప్రేక్షకులు కలిసి కూర్చొని చూడదగ్గ ఓ మంచి సినిమా ‘కుబేర’. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com