రాజకీయ దిగ్గజ నేత-జానారెడ్డి
- June 20, 2025
జానారెడ్డి ...తెలుగునాట పార్టీలకు అతీతంగా గౌరవించబడ్డ నాయకుల్లో ఒకరు. సోషలిస్టు భావజాలాన్ని నరనరాల జీర్ణించుకోని, ప్రజా సేవే పరమావధిగా రాజకీయాలు చేసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసిన ఎన్టీఆర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఆయనకు అత్యంత సన్నిహితులు. తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రభుత్వంలో ఉంటూనే పోరాడారు. తెలుగునాట ఏ మంత్రికి దక్కని అరుదైన ఘనతలు ఆయన దక్కించుకున్నారు.నేడు రాజకీయ దిగ్గజ నేత జానారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
జానారెడ్డి పూర్తి పేరు కుందూరు జానారెడ్డి. 1946, జూన్ 20న ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మిర్యాలగూడ ఫిర్కా అనుముల గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఊహ తెలియని వయస్సులోనే తల్లి మరణించడంతో తమ అమ్మమ్మ గారింట్లో పెరిగారు. తండ్రి వీరా సాధారణ వ్యవసాయదారుడు. మిర్యాలగూడలో పన్నెండో తరగతి (పీయూసీ) వరకు చదువుకున్నారు.
జానారెడ్డి విద్యార్ధి దశలోనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకునేవారు. క్రమంగా సమాజంలో జరుగుతున్న వ్యవహారాల మీద అవగాహన పెంచుకుంటూ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా విద్యార్ధి దశలోనే విద్యార్ధి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. విద్యార్ధి దశలోనే ఆయనకు ప్రముఖ సోషలిస్టు నాయకుడైన కె.వి.సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. ఆయన మార్గదర్శనంలో సోషలిజం పట్ల, రాజకీయాల పట్ల అనేక విషయాలను సంగ్రహించారు. నాటి నుండి ఆయన్ని తన రాజకీయ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.
సత్యనారాయణ గారి ద్వారా పలువురు సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులతో జానారెడ్డికి పరిచయాలు ఏర్పడ్డాయి. 1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1977లో జైలు నుంచి విడుదలైన తర్వాత తన గురువుతో కలిసి జనతా పార్టీలో చేరారు. 1978లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చలకుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ కురువృద్దుడైన నిమ్మల శ్రీరాముల మీద ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దీ రోజులకే అనుముల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1981లో పెద్దవూరు సమితి అధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
సమితి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తన గురువు సత్యనారాయణ ప్రోద్బలంతో 1982లో తెదేపాలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి బయటికి వెళ్లే వరకు ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 1983లో చలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1983-85 వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయం, పశుసంవర్థక, అటవీ, సహకార, చక్కెర, మార్కెటింగ్, తూనికలు & కొలతలు, ఆర్ & బి, రవాణా, పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరా మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రిగా జానారెడ్డి పనిచేశారు. 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ గారి వెన్నంటి ఉంటూ మనోధైర్యాన్ని కల్పించారు.
1985లో వచ్చిన మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చలకుర్తి నుంచి రెండోసారి ఎన్నికైన తర్వాత వ్యవసాయం & అనుబంధ విభగాలు, రవాణా మరియు పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1988 చివరి వరకు కొనసాగారు. సమితిలను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకురావడంలో పంచాయితీరాజ్ మంత్రిగా జానారెడ్డి కీలకమైన పోషించారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను నష్టాల నుంచి లాభాల బాట పట్టించడం, ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ డిపోల నిర్మాణం కూడా ఆయన హయాంలోనే జరిగాయి. అయితే, 1988లో ఎన్టీఆర్ ఒక్క మాటైనా చెప్పకుండా ఒకేసారి క్యాబినెటును డిస్మిస్ చేయడంతో మనస్థాపం చెందిన జానారెడ్డి తన గురువుతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. కొద్దీ నెలల పాటు తెలుగు మహానాడు వేదిక పేరిట ఎన్టీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
1989 ఎన్నికల ముందు జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డిల ఆహ్వానం మేరకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జానారెడ్డి ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చలకుర్తి నుంచి మూడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఎన్టీఆర్ ప్రభంజనంలో ఓడిపోయారు. 1999లో అదే స్థానం నుంచి నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఐదోసారి అసెంబ్లీకి ఎన్నికైన అయన దాదాపు దశాబ్దం తర్వాత వైయస్సార్ మంత్రివర్గంలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2009 వరకు అదే పదవిలో కొనసాగారు. ఆయన సారథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపింది. ఆ చర్చలు కొన్ని కారణాల రీత్యా విఫలం అయినప్పటికి హోం మంత్రిగా ఆయన చూపిన చొరవను అన్ని వర్గాలు అభినందించాయి.
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చలకుర్తి స్థానే నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పడటంతో 2009 ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీ చేసి ఆరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ రెండోసారి సీఎం అయిన తర్వాత జానారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. అయితే, వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య మంత్రివర్గంలో పంచాయితీరాజ్ మరియు అనుబంధ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రోశయ్య తర్వాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సైతం అదే శాఖల్లో కొనసాగారు. మంత్రిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర సాధనకు తనవంతు కృషి చేసి రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యభూమిక పోషించారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఏడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జానారెడ్డి తెలంగాణ తోలి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2015లో ఆయన ముఖ్య అనుచరుడు మిర్యాలగూడ ఎమ్యెల్యే నల్లమోతు భాస్కర్ రావు గులాబీ గూటికి చేరుకోవడం ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి ఓటమి పాలయ్యారు. 2021లో సిట్టింగ్ ఎమ్యెల్యే నోముల నరసింహయ్య మరణించడంతో వచ్చిన నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో సైతం ఓటమి చెంది క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2023లో తనయుడు జైవీర్ రెడ్డిని నాగార్జునసాగర్ ఎమ్యెల్యేగా గెలిపించుకొని తన పట్టు తగ్గలేదని నిరూపించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని నల్గొండ ఎంపీగా గెలిపించారు.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను లెక్క చేయకుండా రాజకీయాల్లో కొనసాగిన జానారెడ్డి 18 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. తెలుగునాట ఇంత అత్యధిక కాలం పనిచేసిన రికార్డు మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి (15 సంవత్సరాలు) పేరిట ఉండేది. దాన్ని జానారెడ్డి తన పేరిట నిలుపుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ మొదటి మంత్రివర్గంలో దాదాపు 15 పైగా మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఘనత కూడా ఆయన సొంతం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన ఆయనకు అన్నిటా సముచిత గౌరవం దక్కింది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ