యూఏఈలో తగ్గుతున్న బర్త్ రేట్లు.. ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఆందోళన..!!

- June 26, 2025 , by Maagulf
యూఏఈలో తగ్గుతున్న బర్త్ రేట్లు.. ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఆందోళన..!!

యూఏఈ: యూఏఈలో తగ్గుతున్న జనన రేట్లను సరిదిద్దే విస్తృత వ్యూహంలో భాగంగా, ఎమిరాటీలకు మద్దతుగా అధునాతన సేవలను అందించేందుకు ఫెడరల్ సంతానోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం అబుదాబిలో జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించారు. సాధ్యాసాధ్యాల అధ్యయనాలు జరుగుతున్నాయని ఫ్యామిలీ హెల్త్ మినిస్ట్రీ మంత్రి సనా సుహైల్ వెల్లడించారు.  

ఈ కేంద్రాన్ని ఆరోగ్య,  నివారణ మంత్రిత్వ శాఖ, ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె వివరించారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ముందస్తు ఫెర్టిలిటీ కౌన్సెలింగ్, సంతానోత్పత్తి సేవలను అదించే లక్ష్యంతో ఈ ప్రణాళిక ఉంటుందన్నారు.  "సంతానోత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్యం అనే అంశం జాతీయ ప్రాధాన్యత" అని సుహైల్ అన్నారు.  జనన రేటును పెంచడానికి ఏకీకృత జాతీయ వ్యూహాన్ని 2025 చివరి నాటికి ఆమోదించి ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ వ్యూహాన్ని 17 సమాఖ్య, స్థానిక సంస్థల సహకారంతో రూపొందిస్తున్నారు.

అధికారిక గణాంకాలు 2015 -2022 మధ్య ఎమిరాటీలలో జననాలలో 11 శాతం తగ్గుదల ఆందోళనకరంగా ఉందని వెల్లడించాయి. అయితే అదే కాలంలో పౌరులు కాని వారిలో జననాల రేటు 5 శాతం పెరగడం గమనార్హం. 2022లో 65,762 మంది ప్రవాసులతో పోలిస్తే కేవలం 30,889 మంది ఎమిరాటీలు మాత్రమే జన్మించారు.

"వెంటనే చర్యలు తీసుకోకపోతే 25 సంవత్సరాలలో ఎమిరాటీలు జనాభాలో 10 శాతం కంటే తక్కువగా ఉండవచ్చు" అని FNC సభ్యుడు సుల్తాన్ అల్ జాబి అన్నారు. ప్రసూతి సెలవులు, తల్లిపాలు ఇచ్చే హక్కులను పునఃసమీక్షించడం, పిల్లల సంరక్షణ సెలవులను ప్రవేశపెట్టడం, పని చేసే తల్లులకు ప్రాధాన్యత ఇవ్వడానికి రిమోట్ వర్క్ విధానాలను సమీక్షించడం వంటి 15 సిఫార్సులను కౌన్సిల్ ఆమోదించింది.

కాగా, పెరుగుతున్న సగటు వివాహ వయస్సు, యువతలో వివాహం చేసుకోవడానికి పెరుగుతున్న అయిష్టత గురించి సభ్యులు ఆందోళనలను లేవనెత్తారు. కొంతమంది యువ ఎమిరాటీలు ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటున్నారని, ఇది సంతానోత్పత్తి,  వివాహ రేటును ప్రభావితం చేస్తుందని డాక్టర్ మోజా అల్ షెహి వెల్లడించారు.  FNC సభ్యురాలు అమ్నా అల్ అదిది మాట్లాడుతూ.. యువకులలో ధూమపానం, మాదకద్రవ్యాల వాడకం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు ఫెర్టిలిటీ రేటుపై ప్రభావం చూపుతుందన్నారు. అలాగే, పెరుగుతున్న జీవన వ్యయాలు, గృహాలు, ఆర్థిక భద్రత వంటివి పెద్ద కుటుంబాలకు ముఖ్యమైన  సమస్యలుగా మారాయని, దాంతో వివాహం ఆలస్యం అవుతుందని అనేక మంది సభ్యులు అభిప్రాయపడ్డారు. కుటుంబాలకు మద్దతు ఇచ్చే గృహ పరిష్కారాలను అన్వేషించడానికి మంత్రిత్వ శాఖ ఇంధన, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోందని సుహైల్ చెప్పారు.   

 

 
 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com