అక్కినేని మార్గదర్శి-దుక్కిపాటి మధుసూదనరావు

- July 17, 2025 , by Maagulf
అక్కినేని మార్గదర్శి-దుక్కిపాటి మధుసూదనరావు

తెలుగు చిత్రసీమలో మరపురాని చిత్రాలను రూపొందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తొలి చిత్రం ‘దొంగరాముడు’ మొదలు చివరి సినిమా ‘అమెరికా అబ్బాయి’ వరకు విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు దుక్కిపాటి. ఆయన దూరదృష్టి కారణంగానే, ఏయన్నార్ భారతదేశం గర్వించదగ్గ మహానటుడు అనిపించుకోగలిగారు. జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. నేడు దిగ్గజ సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

దుక్కిపాటి మధుసూదనరావు 1917 జూలై 27న ఉమ్మడి కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామంలో సీతారామ స్వామి, గంగాజలం దంపతులకు జన్మించారు. దుక్కిపాటి బాల్యం సాఫీగా సాగలేదనే చెప్పాలి. చిన్నతనంలోనే కన్నతల్లి మరణం, అనారోగ్యంతో తండ్రి మంచాన పడటంతో కొద్దీ కాలం చదువుకు స్వస్తి పలికి వ్యవసాయం చేశారు. తండ్రి ఆరోగ్యం కొద్దిగా కుదుటపడ్డ తర్వాత బందరు నోబుల్ కళశాలలో చేరారు. దుక్కిపాటి ఆ రోజుల్లోనే బి.ఏ పాసయ్యారు.

కాలేజీ రోజుల్లోనే నాటకాల మీదున్న మక్కువతో కాలేజీ సాంస్కృతిక సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కూడా వ్యవసాయం చేస్తూనే నాటకాలు వేసేవారు. ముదినేపల్లిలో "ఎక్సెల్సియర్మ్ క్లబ్" వుండేది. తరచూ దుక్కిపాటి అక్కడకు వెళ్తుండేవారు. ఆ సమాజం పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుపుతూ వుండేది. అయితే దుక్కిపాటి ధృక్పథం వేరేగా వుండేది. సాంఘిక నాటకాలైతే ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చనేది ఆయన ఉద్దేశ్యం. అలాగే తన ఉద్దేశ్యాన్ని క్లబ్ యాజమాన్యానికి సూచించారు. ఆ క్లబ్ నిర్వాహకులు అందుకు అంగీకరించి దుక్కిపాటిని క్లబ్ కార్యదర్శిగా ఎంపికచేసి, సాంఘిక నాటకాల ప్రదర్శనల బాధ్యతలను వారికి అప్పగించారు.

గుడివాడకు చెందిన కోనేరు కుటుంబరావుతో ‘ఆశాజ్యోతి’ అనే నాటకాన్ని రాయించి ప్రదర్శనలు ఇచ్చారు. ఆలాగే సూరపనేని శోభనరావు అనే మరొక రచయిత చేత ‘సత్యాన్వేషణ’ అనే నాటకాన్ని రాయించి ప్రదర్శనలు నిర్వహించారు. ‘సత్యాన్వేషణ’ నాటకం వితంతు వివాహాలను, కుల, మత సంకుచిత భావాల నిర్మూలన వంటి నేపథ్యంలో నడుస్తూ ప్రగతిశీలక భావాలకు అద్దంపట్టింది. ఈ రెండు నాటకాలు 1941-44 మధ్యకాలంలో విస్తృతంగా ప్రదర్శనకు నోచుకున్నాయి. అయితే ఈ నాటకాలలో విప్లవ భావాలను ప్రేరేపించే విషయాలు వున్నాయని ప్రభుత్వం వీటి ప్రదర్శనలను నిషేధించింది.

నాటకాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేబడుతున్న సమయంలోనే గుడివాడలో ‘విప్రనారాయణ’ అనే నాటకంలో దేవదేవిగా ఓ కుర్రాడు బాగా నటిస్తున్నాడనే విషయం దుక్కిపాటి దృష్టికి వచ్చింది. ఆ కుర్రవాడి అన్నయ్య రామబ్రహ్మంతో మాట్లాడి తమ నాటక సమాజంలో ఆ కుర్రవాడిని చేర్చేందుకు ఒప్పించారు. ఆ కుర్రవాడే ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు. దుక్కిపాటి శిష్యరికంలో నటన పట్ల పూర్తి అంకితభావాన్ని పెంచుకొని వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ సాటి లేని మేటి నటుడిగా ఎదిగారు అక్కినేని. ఆయన ప్రోత్సాహంతోనే చిత్రసీమలో అడుగు పెట్టారు. ఘంటసాల బలరామయ్యను ఆకట్టుకోగలిగారు. తెలుగు చిత్రసీమలో మేటి హీరోగా వెలిగిపోయారు.‘తన ప్రతి విజయం వెనుక ఉన్నది దుక్కిపాటి వారి మేధాశక్తి’ అని అక్కినేని పలుమార్లు చెప్పుకున్నారు.

నాటకాలకు ఆదరణ తగ్గుతున్న సమయంలోనే ఏయన్నార్ ఆహ్వానం మేరకు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సాహిత్యమంటే వారికి  ఎంతో అభిమానం. అన్ని భాషల సాహిత్యాన్ని చక్కగా చదివేవారు.మరీ  ముఖ్యంగా బెంగాలీ కథలంటే ఎంతో ఆసక్తి. వాటిని తెలుగులో సినిమాలుగా రూపొందించాలని తపించేవారు. తనకు నచ్చిన కథలను, జనం మెచ్చేలా ఎలా మలచాలో యోచించేవారు. ఏయన్నార్ హీరోగా విజయాలు సాధిస్తున్నా, ఆయనను వైవిధ్యమైన పాత్రలు పలకరించడం లేదని భావించారు దుక్కిపాటి మధుసూదనరావు. తన హీరో వరైటీ రోల్స్ చేయాలంటే, ముందుగా సొంత సంస్థ ఒకటి ఉండి తీరాలని దృఢంగా నిశ్చయించారు.

దుక్కిపాటికి కన్నతల్లి లేకపోయినా, సవతితల్లి అన్నపూర్ణమ్మ ఏ లోటు లేకుండా పెంచి పెద్దచేసింది. అందుకు కృతజ్ఞతగా ఆమె పేరిట 1951,సెప్టెంబరు 10న  అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావులతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను స్థాపించారు. సంస్థ చైర్మన్‌గా అక్కినేని, తాను ఎండీగా ఉన్నారు. సంస్థకు ఛైర్మన్ అయినా అక్కినేని ఏనాడు నిర్మాణ వ్యవహారాల్లో ఎప్పుడూ కలుగజేసుకోలేదు. అక్కినేని ఒక గురువు వెంట శిష్యుడిలా దుక్కిపాటి వెంట నడిచారు. అక్కినేనికి ఆయనే ఫ్రండ్, ఫిలాసఫర్, గైడ్ కూడా. విధానపర నిర్ణయాలన్నీ దుక్కిపాటే తీసుకునేవారు.

తమ సంస్థ తరఫున తొలి సినిమా బాగా రావాలి కదా అని మంచి దర్శకునికోసం అన్వేషించారు. అదే సమయంలో దర్శక దిగ్గజం కేవీ రెడ్డి ‘పెద్దమనుషులు’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా తీయాలని నిర్ణయించారు దుక్కిపాటి, అక్కినేని. అందుకోసం కొంతకాలం ఆగాలని కేవీ రెడ్డి చెప్పారు. అందుకు అన్నపూర్ణ అధినేతలూ అంగీకరించారు. ‘పెద్దమనుషులు’ పూర్తయ్యాక చెప్పినట్టుగానే కేవీ రెడ్డి ‘అన్నపూర్ణ’ వారి చిత్రం అంగీకరించారు. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో దుక్కిపాటి నిర్మించిన చిత్రం ‘దొంగరాముడు’. ఈ చిత్రానికి కేవీ రెడ్డి, డి.వి.నరసరాజు, దుక్కిపాటి మధుసూదనరావు కలసి కథను తయారు చేసుకున్నారు.

డి.వి.నరసరాజు మాటలు రాయగా, సముద్రాల పాటలు పలికించారు. ఏయన్నార్, సావిత్రి ప్రధాన జంట, జమున, జగ్గయ్య మరో జంట. ఆర్ .నాగేశ్వరరావు విలన్. వీరి మధ్య సాగే కథతో రూపొందిన ‘దొంగరాముడు’ 1955 అక్టోబర్ 1న విడుదలయింది. ఆ మరుసటి రోజునే అంటే అక్టోబర్ 2నే గాంధీ జయంతి. దీనిని దృష్టిలో ఉంచుకొనే, ఇందులో గాంధీజీపై సాగే, “భలే తాత మన బాపూజీ…” అనే పాటను చొప్పించారు. దీనిని బట్టే, కేవీ రెడ్డి, దుక్కిపాటి ఎంత పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ‘దొంగరాముడు’ చిత్రం ఘనవిజయం సాధించింది.

‘దొంగరాముడు’ విజయం సాధించగానే, మళ్ళీ కేవీ రెడ్డి దర్శకత్వంలోనే మరో సినిమా తీయాలని ఆశించారు. అయితే అప్పటికే కేవీ రెడ్డి విజయావారి ‘మాయాబజార్’ అంగీకరించారు. దాంతో వేరే దర్శకునితో సినిమా తీయమని ఆయన సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు మిత్రుల సలహా మేరకు ఆదుర్తి సుబ్బారావును దర్శకునిగా ఎంచుకున్నారు. బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘దేవదాసు’ నవల ఆధారంగా రూపొందిన చిత్రంతోనే ఏయన్నార్ నటునిగా మంచి పేరు సంపాదించారు. అందువల్ల శరత్ బాబు నవల అయితే బాగుంటుందనీ భావించారు. శరత్ రాసిన ‘నిష్కృతి’ అనే నవల ఆధారంగా ‘తోడికోడళ్ళు’ తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొంది, మంచి విజయాన్ని మూటకట్టుకుంది. అలా తన మదిని హత్తుకున్న కథలను సినిమాలకు అనుగుణంగా మలచడంలో పట్టు సాధించారు.

‘తోడికోడళ్ళు’ విజయం తరువాత ఏయన్నార్, సావిత్రి జంటగా “మాంగల్య బలం, వెలుగునీడలు” వంటి విజయాలు చూశారు దుక్కిపాటి. ఏయన్నార్ ను ద్విపాత్రాభినయంలో చూడాలని దుక్కిపాటి ఆశించారు. అందుకోసం బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’ను ఎంచుకున్నారు. దాని ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ఇద్దరు మిత్రులు’. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఎంతసేపూ పరభాషా కథలతో చిత్రాలు తీయడమేనా? మన తెలుగు కథలు సినిమాలకు పనికిరావా? అన్న ఆలోచన కలిగింది దుక్కిపాటికి. దాంతో డాక్టర్ శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ పేరుతో తెరకెక్కించారు. ఆ సినిమా మునుపటి చిత్రాల స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘అన్నపూర్ణ’ సంస్థ చిత్రాల స్థాయిలో పాటలతో అలరించింది.

 ప్రముఖ నవలా రచయిత్రి ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవలను ‘డాక్టర్ చక్రవర్తి’ పేరుతో సినిమాగా మలిచారు దుక్కిపాటి. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ‘తోడికోడళ్ళు’ మొదలు ‘డాక్టర్ చక్రవర్తి’ దాకా అన్ని చిత్రాలకూ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఆదుర్తి వద్ద అసోసియేట్ గా పనిచేసిన కె.విశ్వనాథ్ ను తమ ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. ఈ సినిమా దర్శకునిగా విశ్వనాథ్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది.అన్నపూర్ణ సంస్థ అన్ని చిత్రాలలోనూ ఏయన్నార్ కథానాయకుడు. ఆ సంస్థ నుండి అక్కినేని సినిమా వస్తోందంటే అభిమానులు ఆనందంతో పొంగిపోయేవారు.అయితే ఎందుకనో ‘ఆత్మగౌరవం’ ఫ్యాన్స్ కు అంతకు ముందు ఉన్న కిక్ ఇవ్వలేదు. ఆ తరువాత ఏయన్నార్ సినిమాలు సైతం అంతగా అలరించలేకపోతూ వచ్చాయి.

ఈ సమయంలో ఎలాగైనా ఏయన్నార్‌కు ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని తపించారు దుక్కిపాటి. పలు కథలను చర్చించారు. చివరకు ముళ్ళపూడి వెంకటరమణ ‘బియాండ్ దిస్ ప్లేస్’ నవల ఆధారంగా ‘పూలరంగడు’ అనే కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నవలారచయిత్రి రంగనాయకమ్మ మాటలు రాశారు. ‘పూలరంగడు’ ఊహించినట్టుగానే మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఏయన్నార్‌కు మళ్ళీ మాస్ లో ఫాలోయింగ్ పెంచింది. సారథీ స్టూడియోస్ భాగస్వామ్యంలో యద్దనపూడి సులోచనారాణి నవల ‘ఆత్మీయులు’ను తెరకెక్కించారు.వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది.

దుక్కిపాటి ఆ తరువాత నిర్మించిన “జైవాన్, అమాయకురాలు” చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. మళ్ళీ తమకు అచ్చి వచ్చిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘విజేత’ నవలను ‘విచిత్రబంధం’గా నిర్మించి, ఘనవిజయం సాధించారు. ఈ సినిమా ద్వారా రామకృష్ణను గాయకునిగా పరిచయంచేశారు. ‘విజేత’ తరువాత మరో యద్దనపూడి నవల ‘బంగారు కలలు’ను అదే పేరుతో నిర్మించారు. దీనికి కూడా ఆదుర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం సాధించినా, ‘విచిత్రబంధం’ స్థాయి చూడలేదు. ఇదే అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో ఏయన్నార్ హీరోగా రూపొందిన చివరి చిత్రం.

దుక్కిపాటి ఆ తరువాత కూడా యద్దనపూడి నవలలు ‘ప్రేమలేఖలు, రాధాకృష్ణ’ను అవే పేర్లతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు. బాపు, రమణ కాంబోలో ‘పెళ్ళీడు పిల్లలు’ తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘అమెరికా అబ్బాయి’ నిర్మించారు. ఇవేవీ ఒకప్పటి అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రాల స్థాయిని అందుకోలేదు. కానీ, నిర్మాతగా సంతృప్తి కలిగించాయి. తొలి సినిమా మొదలు చివరిదాకా విలువలకు ప్రాధాన్యమిస్తూ సాగిన దుక్కిపాటి మధుసూదనరావు చిత్రసీమలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ముందుకు సాగలేకపోయారు. అయితే తెలుగు చిత్రసీమలో నవలల ఆధారంగా ఎక్కువ చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దుక్కిపాటి నిలచిపోయారు.

సినీ పరిశ్రమకు దుక్కిపాటి అందించిన సేవలకు గుర్తింపుగా 1993లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుక్కిపాటిని రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. ఈ పురస్కారం క్రింద అందించిన యాభైవేల రూపాయలను కె.వి. రెడ్డి స్మారక నిధిగా వెచ్చించి ప్రభుత్వానికే ఆ నిధిని అందజేసి ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో ఉత్తమ దర్శకునికి కె.వి. రెడ్డి పేరుతో స్వర్ణ పతకాన్ని బహూకరించేలా స్మారకనిధిని యేర్పాటు చేశారు. దుక్కిపాటి నిర్మించిన 22 చిత్రాలలో 16 సినిమాలు శతదినోత్సవాలు, 4 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. 16 సినిమాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బహుమతులు దక్కడం విశేషం. 2006 మార్చి 26న ఆయన కన్నుమూశారు. ఆయన చిత్రాలు మాత్రం నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తూనే ఉన్నాయి.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com