తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక సూచనలు!

- July 19, 2025 , by Maagulf
తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక సూచనలు!

హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.ఈ క్రమంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా శారీరక పరిశుభ్రత, ఆహారం, నీటి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

వైద్య నిపుణుల ముఖ్య సూచనలు

ప్రజలు ఇతరులతో కరచాలనం చేయకుండా జాగ్రత్త పడాలి. తరచుగా చేతులు సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. వర్షాల కారణంగా దోమలు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఇంటి చుట్టూ నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని సూచించారు. తలుపులు, కిటికీలకు మెష్‌లు అమర్చడం ద్వారా దోమల ప్రవేశాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. నీటి ట్యాంకులు, డ్రైనేజీలు తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆహారానికి జాగ్రత్తలు, ఆసుపత్రుల్లో మందుల లభ్యత

వర్షాకాలంలో కలుషిత నీరు మరియు ఆహారం వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశముంది. అందుకే తాగడానికి ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే వాడాలని, బహిరంగంగా విక్రయించే ఆహారాన్ని తినకుండా ఉండాలని సూచించారు. భోజనం ముందు, తరువాత చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే, సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందుల నిల్వలు సరిపడా ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com