సింహం కథ

- July 16, 2015 , by Maagulf
సింహం కథ


అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. నక్క, పులి దానికి మంత్రులుగా ఉండేవి. ప్రతిరోజూ సింహం వేటాడి తెచ్చుకొని తిన్న మాంసంలో మిగిలినవి మంత్రులైన పులి, నక్క తింటూ కాలం గడుపుతూ ఉండేవి. కొన్నాళ్లకు ఆ అడవిలోకి ఒక ఒంటె దారితప్పి వచ్చింది. అది పులి, నక్కకు ఎదురు పడి తను దారి మర్చిపోయిన సంగతి తెలిపాయి. అప్పుడు అవి ఆ ఒంటెను సింహం వద్దకు తీసుకువెళ్లి దాని సంగతి చెప్పగా సింహం జాలిపడి దాన్ని తన దగ్గరే ఉంచుకుంది. అప్పట్నుంచీ సింహానికి రకరకాల సేవలు చేస్తూ అతి తొందరలోనే సింహం మెప్పు పొంది నమ్మకాన్ని ఏర్పర్చుకుంది. ఇది మంత్రులైన పులికి, నక్కకి నచ్చలేదు. దాంతో ఈ ఒంటెను ఎలాగైనా చంపాలని టైం కోసం వేచి చూస్తున్నాయి. ఒకరోజు సింహానికి జబ్బు చేసి వేటకి వెళ్లే ఓపిక లేక ఆకలితో ఉండడం వల్ల ఆ పనిని మంత్రులకి అప్పగించింది. టైం కోసం ఎదురుచూస్తున్న పులికి, నక్కకి ఒక పాడు ఆలోచన వచ్చింది. దానిలో భాగంగా అవి రెండూ సింహం దగ్గరకు వెళ్లి రాజా మీరు ఇంత ఆకలిగా ఉన్నారు. ఇన్నాళ్లు మీరు పెట్టిన తిండి తిని బతికిన వాళ్లం.ఈరోజు మీకు ఆహారం అవ్వడం మాకు పుణ్యం. కనుక మీరు నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అని పులి ముందుకొచ్చింది. నువ్వు కూడా నాలాంటి వాడివే నిన్ను నేనుతినలేను అంది సింహం. పోనీ నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అని కపట నక్క ఒక అడుగు ముందుకేసింది. కానీ సింహం ఛీ నక్క మాంసం నేను తినడమా? వద్దు అంది. ఇంతలో ఒంటె నన్ను భుజించండి రాజా! అంటూ ముందుకొచ్చింది. ఇంతలో నక్క ఆలోచించకండి ప్రభూ! వెంటనే ఒంటెను మీరు ఆహారంగా తీసుకోండి. ఎందుకంటే ఆదరించిన వారికి ఆహారంగా మారటం ఒంటె చేసుకున్న పుణ్యం. అది చనిపోయి పుణ్యలోకాలకు పోతుంది. అనగానే సింహం అమాంతం దాన్ని చంపి తన ఆకలి తీర్చుకుంది.
దుష్ట జనులు, దుష్ట ఆలోచనలున్న వారిని సేవించినచో మంచివాడైనా మరణించే ముప్పు తప్పదు అనేది ఈ కథలోని నీతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com