దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది..

- July 20, 2016 , by Maagulf
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది..

 దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు జులై 22 (శుక్రవారం) చర్చకు రానున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బిల్లుకు మరిన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లును పాస్ చేయించుకునేందుకు కాంగ్రెస్ నేతలు మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి నేతృత్వంలో బృందం తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న డీఎంకే ఎంపీ, ఆ పార్టీ అధినేత కరుణానిధి కూతురు కనిమొళిని కలిశారు.
తమ బిల్లుకు మద్దతివ్వాలని వారు ఆమెను కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కనిమొళి సభలో బిల్లు ఓటింగ్‌కు వస్తే అనుకూలంగా ఓటేస్తామని హామీ ఇచ్చారు. కనిమొళిని కలిసిన అనంతరం రఘవీరారెడ్డి మాట్లాడుతూ ఆమె పాజిటివ్‌గా స్పందించారని చెప్పారు.
కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుని పాస్ చేయించేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని ఆయన చెప్పారు. మరోవైపు ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ నేతలు సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలవనున్నారు.
ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఉత్కంఠ: ఏకగ్రీవం అంటూ అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు మద్దతుగా తాను లాబీయింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. కాగా, ఈ బిల్లుకు సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి రాజా మద్దతు కూడగడతున్నారు. ఇదిలా ఉంటే కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
దీంతో అసలు ఈ బిల్లు రాజ్యసభలో ఓటింగ్‌కు వస్తుందా రాదా? అన్న సందేహంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభలో ఓటింగ్ రానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా తప్పకుండా హాజరు కావాలంటూ తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో పాటు బిల్లుకు ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి కేవీపీ బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖలో 2014 ఫిబ్రవరి రాజ్యసభలో ఇచ్చిన హామీలపై వెంకయ్య, జైట్లీని కేవీవీ నిలదీశారు.
ఈ బిల్లు ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదని, ఎలాగైనా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయన కోరారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే సమయమని ఆయన చెప్పారు. ఈ బిల్లును పాస్ చేసుకునేందుకు ఐపికి చెందిన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com