ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్

- October 07, 2025 , by Maagulf
ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్

హైదరాబాద్‌: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న ఏపీ, తెలంగాణ,కర్ణాటక ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాల కోసం ప్రభుత్వాలు భారీగా అప్పులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పేరుతో అప్పుల్లో కూరుకుపోతే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచించారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు తాత్కాలిక లాభం కలిగించినా, దీర్ఘకాలంలో అది ఆర్థిక భారం అవుతుందని అన్నారు. “చేపలు ఇచ్చే బదులు చేపలు పట్టడం నేర్పించాలి” అంటూ వెంకయ్య నాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అలాగే రాజకీయ నాయకుల ప్రవర్తనపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలలో బూతులు తిట్టడం సిగ్గుచేటు అని, ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలు మారే ప్రజా ప్రతినిధులు ముందుగా రాజీనామా చేయాలన్నారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న నాయకులపై విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలని కూడా కోరారు. రాజకీయ వారసత్వాలకు తాను వ్యతిరేకమని, అందుకే తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com