అమరావతిలో ప్రభత్వ ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్

- July 28, 2017 , by Maagulf
అమరావతిలో ప్రభత్వ ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్

రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను విడిచి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ససేమిరా అన్నారు. అయితే – ప్రజలు ఒకచోట, పాలన మరోచోట ఉండడం ఇష్టంలేని చంద్రబాబు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజలకు చేరువగానే ఉండాలని స్పష్టంచేశారు. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా అమరావతి రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేసారు. దీంతో చేసేదిలేక ఉద్యోగులంతా హైదరాబాద్ వదిలి అమరావతి వచ్చేశారు. ఇందుకోసం ప్రభుత్వం వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.
 హైదరాబాద్ లో వారినికి ఆరు రోజుల పని ఉండేది. కానీ అమరావతిలో వారానికి ఐదు రోజులే. పని కూడా 8 గంటలే.! హైదరాబాద్ నుంచి అమరావతి డైలీ వచ్చి వెళ్లేవారికోసం ప్రత్యేక రైలు, ఇక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు, ప్రత్యేక HRA, ఇంకా ఎన్నో అలవెన్సులను చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు కల్పిస్తోంది. నూతన రాజధాని కావడం, భవనాలు, ఇళ్లు లేకపోవడం.. లాంటి ఎన్నో సమస్యలను అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఎదుర్కొన్నారు. అయితే మూడేళ్లలోపే యంత్రాంగమంతా సెట్ రైట్ అయిపోయింది.
 ఇప్పటికే పలు బెనిఫిట్లు పొందుతున్న ప్రభుత్వోద్యోగులకు ఇప్పుడు చంద్రబాబు మరో బంపరాఫర్ ఇచ్చారు. ఉద్యోగులందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి సంబంధించి శుక్రవారం ఉద్యోగులు, నిర్మాణ సంస్థలతో సీఆర్డీఏ సమావేశమై చర్చించింది. ఆలిండియా సర్వీసులు, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చేందుకు అవసరమయ్యే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.  ఆలిండియా సర్వీసు ఉద్యోగులు, ఎమ్మెల్యేలకు 3500 చదరపు అడుగులు, గెజిటెడ్ ఉద్యోగులకు 1800 లేదా 1500 చదరపు అడుగులు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 1200 చదరపు అడుగులు, నాలుగో తరగతి ఉద్యోగులకు 800 చదరపు అడుగుల్లో భవనాలు, అపార్ట్ మెంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆపార్ట్ మెంట్లను జి ప్లస్ 12గా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు నాలుగో తరగతి ఉద్యోగులకు 1200 చదరపు అడుగుల్లో నిర్మించాలని కోరారు. గృహనిర్మాణానికి సంబంధించి మరో దఫా చర్చలు జరగనున్నాయి. అమరావతిలో సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉద్యోగులు స్వాగతించారు.. హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com