పెరిగిన బంగారం ధర.. మరింత పెరిగే అవకాశం

- September 08, 2017 , by Maagulf
పెరిగిన బంగారం ధర.. మరింత పెరిగే అవకాశం

పసిడి ధరలు ఆకాశాన్నితాకుతున్నాయి.. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 990 రూపాయలు పెరిగింది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల ధర 31వేల 350కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి 42వేలకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతోనే బంగారం ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 2015 కనిష్ఠానికి డాలర్‌ విలువ పడిపోవడం కూడా దోహదపడుతోంది. 2016 సెప్టెంబరు తర్వాత ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.

ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపాయి. యుద్ధ వాతారణం నేపథ్యంలో షేర్ మార్కెట్లలో పెట్టబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. నమ్మకమైన పెట్టుబడిగా మారిన బంగారం వైపు చూస్తున్నారు. ఉత్తరకొరియా వివాదం నేపథ్యంలో మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో  15 శాతమే ఉత్తరకొరియా సంక్షోభం వల్లేనని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఇక హారికేన్‌ ఇర్మా అమెరికాపై తీవ్ర ప్రభావం చూపాయి. అంచనావేసిన దానికంటే బలహీనంగా జాబ్ డేటా విడుదలైంది. ఇవన్నీ డాలర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో బంగారం ధరలు పెరిగాయి.

వాషింగ్టన్‌లో గడచిన రెండు నెలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు డాలర్‌ బలహీనతకు, పసిడి పరుగుకు దారితీస్తున్నాయి. ఇటు అమెరికాలో అనిశ్చిత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కానీ, అటు ఉత్తరకొరియాకు సంబంధించి ఘర్షణాత్మక వాతావరణం కానీ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదు. ఇక దీర్ఘకాలంలో అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు యథాతథంగా కొనసాగే అవకాశమూ లేదు. దీంతో  
ఎక్కువకాలం బంగారం ధరలు ర్యాలీ కొనసాగే అవకాశం లేదంటున్నారు. ఈ ఏడాది చివరకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ఔన్స్‌ 1,250 డాలర్ల వద్దకు తిరిగి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com