బంగారం వయా యూరప్

- November 19, 2017 , by Maagulf
బంగారం వయా యూరప్

న్యూదిల్లీ: పసిడి అక్రమార్కులు కొత్త 'మార్గం' ఎంచుకుంటున్నారు. విమానాశ్రయాల్లో భద్రతా బలగాల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు గల్ఫ్‌ దేశాల నుంచి బంగారాన్ని పెద్దఎత్తున తరలించే వారు.. ఇప్పుడు యూరోపియన్‌ దేశాల నుంచి దేశంలోకి తీసుకొస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన ఘటనలతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా అక్రమంగా ఈ లోహాన్ని వివిధ రూపాల్లో స్మగ్లర్లు తరలిస్తుంటారు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి ఇలాంటివి జరుగుతుంటాయి. దీంతో విమానాశ్రయాల్లో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే వారిపై కస్టమ్స్‌ సిబ్బంది ఓ కన్నేసి ఉంచుతాయి.
దీంతో అక్రమార్కులు తమ పంథాను మార్చుకున్నారు. కస్టమ్స్‌ నుంచి తప్పించుకునేందుకు తొలుత యూరోపియన్‌ దేశాలకు వెళ్లి అక్కడి నుంచి మన దేశానికి వస్తున్నారు. సాధారణంగా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న అనుమానాలు తక్కువ వ్యక్తమవుతుంటాయి. దీంతో అక్రమార్కులు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. 'సాధారణంగా యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్‌ చేయడం అరుదు. అందుకే స్మగ్లర్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు' అని కస్టమ్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇటీవల ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి వస్తున్న వృద్ధ జంట వద్ద సుమారు రూ.25.54 లక్షల విలువైన 995 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు లండన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద సుమారు రూ.30లక్షలు విలువైన బంగారాన్ని, పారిస్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ.66లక్షలు విలువైన 2 కేజీల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ సహా ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com