బాల్యం

- May 02, 2015 , by Maagulf

నేనేర్పరచుకున్న

ప్రపంచపు పరిధులు

క్షణ క్షణానికి

సంకుచితమౌతున్నవేళ

నా కనురెప్పల వెనుక

నల్లని నీడలు

కన్నీళ్ళు పరుచుకున్నవేళ

ఆత్మీయత కోసం

అనవరతం అన్వేషిస్తున్నవేళ

శిధిలాల మధ్య

ఆకుపచ్చని పూదోట

ప్రభవించినట్లు

నా చీకటి గుండెగదుల్లో

ఒక వెలుగు కిరణం

తాకుతూ నన్ను పలకరించింది

 

నేను నేస్తం నీ బాల్యాన్ని

అమూల్యమైన నీ జీవిత కాలాన్ని

నీ చేత పిచ్చుక గూళ్ళు కట్టించి

రాగల కాలాన్ని గురించి

అందమైన ఊహలు కల్పించినదాన్ని

 

 

కులాన్నీ మతాన్నీ వర్గాన్నీ

అధికారాన్నీ సంపదలనూ

నీకు దూరంగా ఉంచినదాన్ని

చద్ది బువ్వ మాధుర్యాన్ని

ఉప్పూ కారం అద్దిన

మామిడికాయ రుచుల్నీ

కాకెంగిలితో తిన్న

జామకాయ తీపినీ

అరమరికలు లేకుండా

అందరితో నీవు

పంచుకున్న సమయాన్ని

 

నిను చూస్తే జాలేస్తోంది

తొందరగా ఎగిరిపోయావు

సమాజంలో ఒదిగిపోయావు

అందరికీ భారంగా

ఎవరో కాని మనిషిగా

ఒంటరిగా మిగిలిపోయావు

అయినా ఓ నేస్తం

నా జ్ఞాపకాలే నీకు సమస్తం

వర్తమానాన్ని వదిలేసి

గడచిన మంచి క్షణాల్ని

సతతం మననం చేసుకో

 

పుట్టిన ప్రతి ప్రాణికీ

తప్పదు ఈ చక్రం

ఇరుసులు కోసుకుపోయినా

చిరునవ్వును జారనీకు!

మనసే నీకు బాసట!

తన చెలిమే నీకు ఊరట!

 

మరి ఉంటానే నేస్తం!

నే చెప్పిన ఈ హితవును

జ్ఞాపకాన ఉంచుకో!

 

 

                                        --- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com