రేపు విడుదల కానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు

- December 17, 2017 , by Maagulf
రేపు విడుదల కానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ ఎన్నికల్లో గెలుపెవరిది? మరికొన్ని గంటల్లో తేలనుంది. గుజరాత్‌లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి రేపు ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో మొదటి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 సీట్లు పోలింగ్ జరిగింది. గుజరాత్‌తోపాటు రేపే హిమాచల్ ప్రదేశ్‌లోనూ కౌంటింగ్ జరగనున్నది. గుజరాత్‌లోని 33 జిల్లాల్లోని 37 కేంద్రాల్లో కౌంటింగ్ జరుపనున్నారు. కౌంటింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు విడతల్లో కలిపి 68.41 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 66.75 శాతం, రెండో విడతలో 69.99 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే 2012 కంటే రెండు శాతం పోలింగ్ తక్కువగానే నమోదైంది. మొత్తం 2.97 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికల్లో గెలుపుపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే గుజరాత్ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారని తేల్చేశాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2019 సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అటు మోడీ, ఇటు రాహుల్ గాంధీకి ఈ గుజరాత్ ఎన్నికలు పరీక్షే. 22 ఏళ్లపాటు గుజరాత్‌ను ఏలుతోంది కమలం పార్టీ. వరుసగా ఆరోసారి గుజరాత్‌లో గెలిచి తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలనేది బీజేపీ ప్లాన్. ఆ పార్టీ భారం మొత్తం ప్రధాని మోడీపైనే వేసింది. ప్రధాని కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో పాల్గొని మొత్తం తానై వ్యవహరించారు. 

ఇక గుజరాత్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీకి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌కు గుజరాత్ గెలుపు కీలకం. అక్కడ జెండా ఎగరేస్తే.. ఆయనపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త విశ్వాసం వస్తుంది. రాహుల్ కూడా భారీ ప్రచారం నిర్వహించారు. బీజేపీని గద్దె దించడానికి పాటీదార్, ఓబీసీ, దళిత నేతలు హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగేష్ మేవానీలు కూడా తీవ్రంగా ప్రచారం నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com