హైదరాబాద్‌లో విదేశీ లిక్కర్ ముఠా గుట్టురట్టు

- January 07, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో విదేశీ లిక్కర్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లో మరోసారి విదేశీ లిక్కర్ ముఠా గుట్టు రట్టైంది. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మెరుడు దాడులు నిర్వహించి.. ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా విదేశీ మద్యాన్ని విక్రయిస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 75 లక్షల విలువైన ఫారిన్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హైదరాబాద్ లిక్కర్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఎక్సైజ్  అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన అక్రమ మద్యం దందాను అడ్డుకోలేకపోతోంది. న్యూఇయర్‌కు ముందు కొందరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.. తాజాగా  నగరంలో మెరుపు దాడులు నిర్వహించి భారీగా విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు.

దూల్‌పేట్ కు చెందిన హరీష్ సింగ్, రాజేష్, భాస్కర్, గోపిక్రిష్ణ, అనిల్ కుమార్, నిరంజన్ రెడ్డి, మహేష్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా విదేశీ మద్యాన్ని అక్రమంగా సముద్రం ద్వారా చెన్నై పోర్టుకు దిగుమతి చేసుకుంటున్నారు. చెన్నై నుంచి ప్రైవేట్ బస్సులో  గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. సిటీలో  కొందరు వ్యక్తులతోపాటు పార్టీలు చేసుకునే వారికి ఈ ముఠా సభ్యులు మద్యం విక్రయిస్తున్నారు. విదేశీ మద్యం సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు..సరూర్‌నగర్‌లో  75 లక్షల విలువైన 220 మద్యం సీసాలను  స్వాధీనం చేసుకున్నారు. బస్సు, మూడు బైక్ లను సీజ్ చేశారు. 

ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ కట్టకుండా లిక్కర్ మాఫియా కోట్లు దండుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ ముఠా సభ్యులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తేలింది. లిక్కర్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటివాళ్ల నుంచి మద్యం కొనుగోలు చేసినా  శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com