మెదడుకు యవ్వన ‘బీట్‌’!

- January 13, 2018 , by Maagulf
మెదడుకు యవ్వన ‘బీట్‌’!

మెదడు చురుకుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే వ్యాయామం చేయటానికి ముందు కాస్త బీట్‌రూట్‌ రసం తాగి చూడండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల విషయగ్రహణ సామర్థ్యం, భావోద్వేగాలు, కదలికలతో ముడిపడిన మెదడు భాగాలు ఆరోగ్యంగా ఉంటున్నట్టు వేక్‌ ఫారెస్ట్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ దండిగా ఉంటుంది. ఇది వ్యాయామం చేసేప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో మెదడు క్షీణించటమూ తగ్గుతుంది. అంటే మెదడు ఆయుష్షు కూడా పెరుగుతుందన్నమాట. నైట్రిక్‌ ఆక్సైడ్‌ చాలా శక్తిమంతమైంది. ఇది మన శరీరంలో ఆక్సిజన్‌ అవసరమైన భాగాల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. ఆక్సిజన్‌ను పెద్దమొత్తంలో వినియోగించుకునే అవయవం మెదడే. కాబట్టి ఇది మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చేస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. బీట్‌రూట్‌ రసంతో రక్తపోటు తగ్గుతున్నట్టు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే. కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com