'వేటూరి' జయంతి స్పెషల్
- January 29, 2018
తెలుగు పాటకు ఆయన చిరునామా.. తెలుగు పాటే ఆయనకు చిరునామా.. లలిత శృంగార భావాలను మనోహరంగా కూర్చి అందమైన పాటగా మలచినా.. మొరటు పదాలకు జానపద పలుకులను నేర్పుగా అల్లి మసాలా కూర్చి మెప్పించినా... రాలిపోయే పూవుకు రాగాలెందుకంటూ శ్రోతల గుండెల్ని పిండి ఏడిపించినా .. అది వేటూరి కలానికే చెల్లింది. ఇవాళ పాటూరి రారాజు వేటూరి జయంతి.. బాధల్నీ, విషాదాల్నీ, ఆనందాల్నీ గాయకుల స్వరాల్లో నింపి తెలుగు సినిమా పాటకు ఓ సొగసిరినీ, సౌందర్యాన్ని, పరిపూర్ణత్వాన్ని తెచ్చిన కలం వేటూరిది. సందర్భోచితమైన భావాలను సరళమైన పదాలతో పేర్చి శ్రోతల్ని తన సాహితీ రసజ్ఞతతో ముంచి వేయడం వేటూరి ప్రత్యేకత. ఆయన కలం నుంచి జాలువారితే తెలుగు పదం హొయలు పోతుంది. సంప్రదాయం, యవ్వనం, విరహం, భక్తి, రక్తి, వేదాంతం, వైరాగ్యం.. ఇలా .. భావమేదైనా అది వేటూరి కలంలో పడితే అద్భుతమైన గేయమవుతుంది. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు వేటూరి. తనలోని పదసంపద అనే జ్ఞానానికి బాణీలు అద్ది, ఆ బాణీలతో తెలుగు పాటకు ఓణీలు వేయించారు. సంప్రదాయ కీర్తనలే కాదు, పురాణ సాహిత్యంలోని మాటలనూ తీసుకుని వాటిని అందమైన పాటలుగా మలచడంలో వేటూరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో..
వేటూరి కలంలో శృంగారపు సిరా పాళ్లు కూసంత ఎక్కువే కనిపిస్తాయి. అందుకే గానమూ ప్రాణమూ నీవేనని శంకరుణ్ని ఆరాధించిన ఆ కలమే.. ఆరేసుకోబోయి పారేసుకుంటుంది.. ఇలాంటి పాటలను కూడా అంత అందంగా ఇంకెవరూ రాయలేకపోయారు.. నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా.. తరించిపోతుంది ఆ పట్టుపురుగు జన్మ అంటూ వేటూరి రాస్తే..ఆ భావానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదా పట్టుపురుగు. ఇలాంటి పద ప్రయోగాలు చేయడం అంటే వేటూరికి పాళీతో పెట్టిన విద్య. ఇలా మాటల్నీ మంత్రాలుగా చేసిన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో వేటూరి సిద్ధహస్తుడు.
వేటూరి భావానికి నాటి సంగీత దర్శకులు అద్భుతమైన స్వర ప్రస్థానం కట్టబెట్టారు. ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లోని పాటల్లోని వేగానికి తగ్గట్టుగా వేటూరి కలమూ పరుగులు పెడుతుంది. తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్యే అచ్చెరువొందేలా.. ఆయన జననాన్నే అత్యద్భుతంగా అక్షరీకరించాడు వేటూరి. తెలుగు పదానికి జన్మదినం..ఇది జానపదానికి జ్ఞానపదం, ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం .. ఇంతకు మించి అన్నమయ్యను గురించి చెప్పడం ఇంకెవరికి సాధ్యం..
మంచు కురిసే వేళలో మల్లెవిరిసేదెందుకో అంటూ తొలి ప్రేమ చిగురించే వైనానికి ప్రకృతిని ఆసరా చేసుకుంటాడు. రాలిపోయే పూవుకు రాగాలెందుకు.. వాలిపోయే పొద్దుకు వర్ణాలెందుకు అంటూ వేటూరి కలం ఝలిపిస్తే కన్నీరు పెట్టకుండా ఉండగలమా.. వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి .. ఇలాంటి పదాలను రాస్తున్నప్పుడు అందులోని కష్టం తను అనుభవిస్తూ.. అనుభూతిని మనకు మిగుల్చుతాడు వేటూరి. ఇలాంటిదే మరో పాట ఆకాశాన సూర్యుడుండు సందెవేళకీ .. చందమామకు రూపముండదు తెల్లవారితే అంటూ జీవితం ఎంత చిన్నదో తెలుపుతూనే... ఈ మజిలీ మూడు నాళ్లే అంటూ తత్వాన్నీ బోధిస్తాడు. ఇవన్నీ కవి అనుభవాల నుంచే రావాల్సిన అవసరం లేదు. సమాజాన్నీ.. తన చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనిస్తూ ఉంటే చాలు.. వేటూరి పాటల్లో క్లాస్ ఉన్నాయి మాస్ ఉన్నాయి. పండిత పామరులను మెప్పించిన ఉన్నత సాహితీ విలువలున్న పాటలూ ఉన్నాయి. భాషమీద పట్టుతో పాటు స్వరజ్ఞానం ఆయనకున్న వరం. వేటూరి రాసిన వాటిలో సాంఘికంగా ఎప్పటికీ తిరుగులేని పాట.. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఏదో తెలియని ఫీలింగ్ లోకి వెళ్లిపోతాం.
కెరీర్ ప్రారంభం నుంచీ.. తనదైన శైలిలో తెలుగు సినిమా పాటలో సాహితీ సేద్యం చేసి ఎన్నో అద్భుతమైన పాటలను పండించారు. ముఖ్యంగా ఇళయరాజా, వేటూరి కలయికలో వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. కవిగా ఎంత గొప్పవాడో తెలుగు భాషాభిమానిగానూ ఆయన అంతే గొప్పవాడు. అందుకే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చిన నిజమైన మాతృభాషాభిమాని.. వేటూరి.. భౌతికంగా వేటూరి మనమధ్య లేకపోయినా.. తన అక్షరాలతో అనునిత్య తెలుగు భాషతో మమేకమయ్యే ఉంటారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు