'బ్రహ్మ'ను కూడా నవ్వించగల తెలుగు సినీ హాస్య బ్రహ్మ బర్త్‌డే స్పెషల్
- February 01, 2018
దేవుడు మనిషితో పాటు ఇతర జీవులను సృష్టించినా మనిషికి మాత్రమే నవ్వు అనే ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వెండితెరపై విరబూసి దేవుడిచ్చిన నవ్వు అనే వరాన్ని అందరికీ పంచుతూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు.. మరి అలాంటి ఆనందాన్ని దశాబ్ధాలుగా మనకందిస్తోన్న బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు.
వెండితెరపై నవ్వులు పూయించే నటులు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఒకరు మాటలతో.. మరొకరు ఎక్స్ ప్రెషన్స్‌తో.. కానీ ఈ అన్నిటినీ కలగలిపి అందరినీ నవ్వించేస్తుంటాడు బ్రహ్మానందం. అందుకే ఇన్నేళ్లైనా అతని ఎక్స్ ప్రెషన్స్ కు ఎక్స్ పైరీ డేట్ రాలేదు. అతని డైలాగ్స్ పై మొనాటనీ రాలేదు. వైవిధ్యమైన అభినయంతో నవ్వుల సెలైన్‌ని ప్రేక్షకులకు ఎక్కిస్తూ వారి ఆయుష్షును పెంచుతోన్న కామెడీ 'డాక్టర్' బ్రహ్మానందం.
అసలు నవ్వించడం అంటే నవ్వినంత ఈజీ కాదు.. కానీ నవ్వించడమనే యోగాన్ని జన్మతః పొందిన వరప్రసాదం బ్రహ్మానందం. శవాల మీద పైసలేరుకునే వెధవా.. పోతావ్ రా నాశనమైపోతావ్ రొరేయ్ అంటూ అరగుండుగా మొదలైన ఆ నవ్వుల పరంపర నేటికీ అలాగే కొనసాగుతోంది. అందుకే ఓ దశలో బ్రహ్మానందం లేని తెలుగు సినిమానా.. అని ఆశ్చర్యపోయిన సందర్భాలూ ఉన్నాయి. నటించక్కర్లేదు.. జస్ట్ కనిపించినా చాలు.. కళ్ల వెంట నీళ్లొచ్చేలా నవ్వుకున్న సినిమాలున్నాయి. బ్రహ్మానందం ఫేస్ కు ఉన్న ఫేస్ వాల్యూ అది..
చాలామంది కమెడియన్స్ .. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగానూ మారారు. కానీ ఒకవేళ అలా మారతానన్నా వీలు లేని కమెడియన్ ఒక్క బ్రహ్మానందమే. మనోడు వీరావేశంలో హీరో అయినా.. తీరా ఆ సినిమా పోయాకే తత్వం బోధపడింది. బ్రహ్మకిచ్చిన మాట ప్రకారం ప్రేక్షకులకు ఆనందం పంచడమే పనిగా పెట్టుకున్నాడు.
బ్రహ్మానందాన్ని ఓ నవ్వుల అక్షయ పాత్రగా చేసి, ప్రతి సినిమాకూ సరికొత్త పాత్రతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నాడు. బ్రహ్మానందం చేసే కామెడీకి నవ్వాపుకోలేక చాలాసార్లు ప్రేక్షకులు.. వీడి కామెడీతో చంపేసేలా ఉన్నాడు అని అనుకున్నవారు లేకపోలేదు. ఆ కితకితలకు అలవాటుపడ్డారేమో బ్రహ్మానందం ఇతర పాత్రలు వేయొద్దని చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
అసలెవరు ఊహించారు మనకు రేలంగి, రాజబాబు వంటి కమెడియన్స్ సరసన నిలిచే కమెడియన్ వస్తాడని.. వారిని సైతం మరిపించేంతటి నవ్వులు పంచుతున్నాడు. జంధ్యాల, కృష్ణారెడ్డి, ఇవివి సత్యన్నారాయణ.. వంటి అతిరథుల కంట్లో పడ్డాడు. బ్రహ్మీలో వేళ్లూనుకుపోయి ఉన్న హావభావాలన్నీ బయటకు తీసి మరీ ఆడియన్స్ ను కుర్చీలో కూర్చోకుండా చేసేశారు. హాయిగా నవ్వింపచేశారు..
అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ని ఆపలేకపోవచ్చు.. కానీ బ్రహ్మీని అడ్డు పెట్టుకుని సినిమాలు నిలుపుకోవచ్చు. హీరోతో పనిలేకుండానే ఇరగదీసేయొచ్చు. కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్రరావైనా.. కామెడీ డైరెక్టర్ ఇవివి అయినా.. ఎవరైనా సరే బ్రహ్మానందాన్ని నమ్ముకుని, సరైన పాత్ర రాసుకుంటే చాలు.. హీరోలతో పనిలేకుండానే సక్సెస్ అయిపోతారంతే.
హీరో, హీరోయిన్ల కంటే ముందు బ్రహ్మీ ఉన్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని మరీ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులున్నారు. ఓ వైపు కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ తెగ నవ్విస్తోన్న టైమ్ లోనే కమెడియన్ గా బ్రహ్మానందం ఆ స్థాయికి చేరుకోవడం తెలుగువారు చేసుకున్న అదృష్టం. మెగా స్టార్ నుంచి సడెన్ స్టార్ వరకూ బ్రహ్మానందం కాంబినేషన్ వర్కవుట్ కాని సినిమాల్లేవ్. ఎన్నివేళ్లున్నా బొటనవేలు లేకపోతే వేస్ట్ అన్నట్టు తెలుగు సినిమా కామెడీకి బొటనవేలయ్యాడు బ్రహ్మీ.
అయితే కొత్త కమెడియన్స్, దర్శకులు వస్తున్నారు. ఇంక బ్రహ్మానందం పనైపోయినట్టే.. అనుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలా అనుకున్న ప్రతి సారీ అతను దేనికైనా రెడీ అంటూ కొత్త కమెడియన్స్ అందరినీ ఢీ కొట్టాడు. బ్రహ్మీకి కొత్త దర్శకులు సైతం బ్రహ్మరథం పట్టారు. చెంపదెబ్బలు తిన్నా, కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆఖరుకి హీరోల చేతిలో చావు దెబ్బలు తిన్నా.. ప్రేక్షకులకు నవ్వాపుకోవడం సాధ్యం కాలేదు. ఓ కమెడియన్ ఇన్నేళ్లుగా రాణిస్తున్నాడంటే కారణం .. అతను దర్శకుల చేతిలో బొమ్మై పోవడం. వాళ్లు ఎలా మలిస్తే అలా నవ్వించడం.
తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేశాడనీ గిన్నిస్ బుక్ లో ఎక్కించారు. లక్షలాది నవ్వులు పంచి ప్రజలకు డాక్టర్ ఫీజ్ తగ్గించాడని డాక్టరేట్ ఇచ్చారు. తెలుగు సినిమా సరస్సులో పద్మమై వికసించాడనీ పద్మశ్రీ ఇచ్చారు. కానీ, బ్రహ్మానందం తర్వాత మళ్లీ బ్రహ్మానందాన్ని ఇవ్వడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మానందాన్ని మళ్లీ సృష్టించాలంటే ఆ బ్రహ్మకూ సాధ్యం కాదు కాబట్టి. వెయ్యి సినిమాల్లో ఇన్నేసి నవ్వుల్ని పంచే యోగాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం జన్మ నిజంగా ధన్యం.
ఓ కొత్త హీరోకు హిట్ కావాలంటే బ్రహ్మానందం కావాలి. వరుస ఫ్లాపులతో ఉన్న హీరో మళ్లీ ఫామ్ లోకి రావాలంటే బ్రహ్మానందం ఉండాలి. రచయితల క్రియేటివిటీని, దర్శకుల వర్కింగ్ స్టైల్ కు అనుగుణంగా వెండితెరపై నవ్వులు విరబూయించాలంటే బ్రహ్మానందమే రావాలి. అందుకే బ్రహ్మీ పని ఐపోయిందన్నమాట బలంగా వినిపించిన తర్వాత కూడా దశాబ్ధం పాటు వెండితెరను ఏలాడీ ఖాన్ దాదా...
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు