భారత్‌కు రాలేను - గీతాంజలి జెమ్స్‌ అధినేత

- March 19, 2018 , by Maagulf
భారత్‌కు రాలేను - గీతాంజలి జెమ్స్‌ అధినేత

న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌లో సీబీఐ తాజాగా జారీ చేసిన సమన్లపై పరారీలో ఉన్న నిందితుడు, గీతాంజలి జెమ్స్‌ అధినేత మెహుల్‌ చోక్సీ బదులిచ్చాడు. తన పాస్‌పోర్ట్‌ రద్దు కావడం, తాను అస్వస్థతతో బాధపడుతుండటంతో భారత్‌కు వచ్చి విచారణలో పాల్గొనలేనని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీబీఐ నోటీసులకు చోక్సీ ఈమెయిల్‌లో బదులిస్తూ..తన పాస్‌పోర్ట్‌ రద్దుపై ఇప్పటి వరకూ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం ఎలాంటి సమాచారం పంపలేదని చెప్పుకొచ్చారు.

విదేశాల్లో వ్యాపార లావాదేవీల్లో తాను పూర్తిగా నిమగ్నమయ్యానని..భారత్‌లో తమపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వ్యాపారం మూసివేత దృష్ట్యా ఎదురైన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున భారత్‌కు రాలేకపోతున్నానని లేఖలో దర్యాప్తు ఏజెన్సీకి స్పష్టం చేశారు. రూ 12,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో తక్షణమే విచారణకు హాజరుకావాలని  నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు ఈ నెల తొలివారంలో సీబీఐ తాజాగా సమన్లు పంపిన విషయం తెలిసిందే. నకిలీ పత్రాలతో వీరిరువురూ పీఎన్‌బీ నుంచి రూ 12,000 కోట్లు పైగా రుణాలు పొంది, కుంభకోణం బయటపడే సమయంలో దేశం విడిచివెళ్లారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com