రివ్యూ: ఛల్ మోహన్ రంగ
- April 05, 2018విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2018
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
దర్శకత్వం : కృష్ణ చైతన్య
నిర్మాతలు : త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫర్ : నటరాజన్ సుబ్రమణియం
ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్
స్క్రీన్ ప్లే : కృష్ణ చైతన్య
నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు మోహన రంగ (నితిన్) అమెరికా వెళితే సాలిడ్ గా సెటిలైపోవచ్చు అనే ఉద్దేశ్యంతో అనేక ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడే అతనికి మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది.
ఒక దశలో ఆ స్నేహమే ప్రేమని తెలుసుకుంటారు ఇద్దరు. కానీ ఒకరి లైఫ్ స్టైల్ మరోకరి లైఫ్ స్టైల్ కు మ్యాచ్ అవ్వదనే కన్ఫ్యూజన్లో ప్రేమని వ్యక్తపరుచుకోకుండానే విడిపోతారు. అప్పటి నుండి ఇద్దరికీ ప్రశాంతత ఉండదు. అలా దూరమైన ఇద్దరూ కొంత కాలానికి తమ ప్రేమ సరైనదేనని, ఒకరికొకరు సరిపోతారని ఎలా ఎప్పుడు గుర్తించారు, ఎలా కలుసుకున్నారు అనేదే తెరపై నడిచే కథ.
ప్లస్:
సినిమాకు ప్రధాన బలం సినిమా హీరో నితిన్ పాత్ర చిత్రీకరణ. నితిన్ ఒక హీరోలా కాకుండా నార్మల్ మధ్యతరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు మోహన్ రంగ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు కృష్ణ చైతన్య అమాయకత్వాన్ని, నిజాయితీని, హాస్యాన్ని మేళవించి కథానాయకుడి పాత్రను తెరపై అవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.
హీరోయిన్ మేఘా ఆకాష్ కూడ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించింది. ఆమెకు, నితిన్ కు మధ్యన నడిచే ఫన్నీ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండి చివరి వరకు అన్ని పాత్రల ద్వారా హాస్యాన్ని పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా చోట్ల సఫలమై నవ్వులు పూయించింది.
చిత్రంలోని పాటలు చాలా వరకు మెప్పించాయి. త్రివిక్రమ్ అందించిన కథ సాధారణమైనదే అయినా సెన్సిబుల్ గా అనిపించింది. అలాగే సినిమాలో చాలా చోట్ల త్రివిక్రమ్ ప్రాసలతో కూడిన డైలాగ్స్ భలేగా పేలాయి.
మైనస్:
త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సెన్సిబుల్ కథను పూర్తిస్థాయి ఎమోషన్ ను క్యారీ చేసేలా డెవలప్ చేయలేకపోయారు దర్శకుడు కృష్ణ చైతన్య. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, హీరో పాత్రతో, డైలాగులతో నెట్టుకొచ్చిన ఆయన ద్వితీయార్థంలో సినిమాను పతాకస్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ప్రేమ కథ ఆరంభం ఎలా అయితే సాదాసీదాగా ఉందో ప్రయాణం, ముగింపు కూడ అలానే నార్మల్ గా ఉన్నాయి.
ఇక హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఎలివేట్ అయ్యేలా బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనబడలేదు. అసలు హీరో హీరోయిన్లు ఒక చిన్నపాటి క్యాజువల్ మీటింగ్ కు ఒకరు రాలేదని మరొకరు అపార్థం చేసుకుని విడిపోవడం కొంత సిల్లీగా అనిపిస్తుంది.
ఇక ద్వితీయార్థంలో ఫన్నీ సీన్స్ మినహా ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సినిమా నీరసంగా ముగిసిన ఫీలింగ్ కలిగింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు కృష్ణ చైతన్య త్రివిక్రమ్ అందించిన కథను ఒక మంచి సినిమాకు సరిపడా స్థాయిలో అభివృద్ధి చేయడంలో కొంత తడబడ్డారు. ముఖ్యమైన ప్రేమ కథలో ఎమోషన్స్ సరిగా పండించలేకపోవడం, కీలకమైన బ్రేకప్, తిరిగి కలుసుకోవడం వంటి అంశాల వెనుక బలమైన కారణాలను చెప్పకపోవడం వంటి బహీనతలతో కొంత నిరుత్సాహపరిచిన కృష్ణ చైతన్య హీరో పాత్రను భిన్నంగా డిజైన్ చేసి నితిన్ ను స్క్రీన్ పై కొత్తగా చూపడంలో, మంచి హాస్యాన్ని పండించడంలో మాత్రం సఫలమయ్యారు.
నటరాజన్ సుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను ఎంతో అందంగా కనబడేలా చేసింది. ఫారిన్ లొకేషన్స్, ఊటీలో తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ ఆహ్లాదపరిచింది. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ బాగానే ఉంది. తమన్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాతలుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన్న ఈ ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం కొంత ఆకట్టుకోని కొంత నిరుత్సాహపరిచింది. హీరో పాత్ర, అందులో నితిన్ నటన, ప్రాసలతో కూడిన మాటలు, రెగ్యులర్ గా వచ్చే కామెడీ సీన్స్, కొన్ని పాటలు ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా కథలో పూర్తిస్థాయి ఎమోషన్, రొమాన్స్ లోపించడం రొటీన్ గా అనిపించే కథనం, కీలకమైన ఘట్టాల వెనుక బలమైన కారణాలు లేకపోవడం డిసప్పాయింట్ చేసే అంశాలు. మొత్తం మీద రొమాన్స్ తగ్గినా.. కామెడీ బాగున్న ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.
మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 2.5/5
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..