ఏ.పి ప్రవాసాంధ్రులకూ భీమా పాలసీ

- April 18, 2018 , by Maagulf
ఏ.పి ప్రవాసాంధ్రులకూ భీమా పాలసీ

అమరావతి:ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ‘బీమా’ భరోసా కల్పించింది. చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థులు, బతుకుదెరువు కోసం దుబాయ్‌, కువైత్‌ తదితర దూరదేశాలకు పోతున్న పేద కుటుంబాల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించింది. వీరి కోసం ప్రవాసాంధ్రుల బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ ఆధ్వర్యంలో సెర్ప్‌ సహకారంతో ఈ పథకాన్ని అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. చంద్రన్న బీమా తరహాలో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే, మూడేళ్ల దాకా ఈ పథక లబ్ధిని పొందవచ్చు. దీనికోసం లబ్ధిదారులు కట్టాల్సింది కేవలం రూ. 150. ప్రవాసాంధ్ర ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. విదేశాల్లో ఉన్న తమవారి తరఫున రాష్ట్రంలోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రీమియం కట్టి పేరు నమోదు చేయించే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రవాసాంధ్ర బీమా పధకం నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీదాకా నమోదు చేసుకున్నవారికి 16వ తేది నుండి బీమా అమల్లోకివస్తుంది మరియు 15వ తేది నుండి 31వ తేది వరకు నమోదు చేసుకున్న వారికీ మరుసటి నెల 1వ తేది నుండి అమల్లోకివస్తుంది. లబ్ధిదారులు లేక వారి తరఫు కుటుంబసభ్యులు పూర్తిచేసిన తమ దరఖాస్తులను వెలుగు సభ్యులకు లేక ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ కో-ఆర్డినేటర్లకు అందించాల్సి ఉంటుంది. దీనిపై మంగళవారం సెర్ప్‌ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

భీమా​ ఎందుకంటే..
ప్రవాసాంధ్ర బీమా పథకంలో చేరిన వ్యక్తి, విదేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే.. మృతదేహాన్ని విమానంలో తీసుకొచ్చి, స్వస్థలంలో ఆయన కుటుంబసభ్యులకు అప్పగించేదాకా, అయ్యే ఖర్చుఈ భీమా పధకం ద్వారా పొందవచ్చు. మృతదేహానికి, వెంట ఉన్న వ్యక్తికి అయ్యే విమాన ఖర్చులను కూడా పొందవచ్చు. విమానంలోంచి ఆ మృతదేహాన్ని దించి.. అంబులెన్స్‌లో స్వస్థలం వరకు తరలిస్తారు. నిజానికి, ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. ఇప్పుడు ఈ బీమా పథకంతో ప్రభుత్వం అండ బాధితులకు ప్రతి అడుగులో లభించే వీలు కలిగింది. అలాగే, లబ్ధిదారు శాశ్వత అంగవైకల్యం పొందితే, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు బీమా అందిస్తారు. ఆ స్థితిలో ఉన్న ఆయనను స్వదేశం తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తే, ఆయనకు, వెంట ఉన్న సహాయకుడికి విమానంలో సాధారణ టికెట్‌ను బుక్‌ చేస్తారు. ఏదైనా ప్రమాదంలో గాయపడిన సందర్భంలో.. అందుకు లబ్ధిదారుకు అయ్యే చికిత్సఖర్చుల కింద రూ.ఒక లక్ష చెల్లిస్తారు.

విద్యార్థులకు వేరుగా..
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అమలుచేయనున్నారు. ఈ పథకం కాలపరిమితి ఏడాది. విదేశాల్లో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు. వీరు ఏడాదికి రూ.75 ప్రీమియం చెల్లించాలి. ప్రమాదం వలన సంభవించే గాయాల చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా, రూ.10 లక్షలు బీమా చెల్లించడం జరుగుతుందని సెర్ప్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com