మానసిక వేదనే నా ఆత్మహత్యకు కారణం.. ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్

మానసిక వేదనే నా ఆత్మహత్యకు కారణం.. ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్

కేంద్ర కేబినెట్‌లో పదవులను సైతం తృణీకరించిన ఆధ్యాత్మిక గురువు మధ్యప్రదేశ్‌కు చెందిన భయ్యూ మహారాజ్. ఇండోర్‌లోని తన ఆశ్రమంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాల్పుల మోత విన్న బంధువులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలకు భయ్యూ మహారాజ్‌పై చాలా గౌరవం. ఎవరైనా నా కుటుంబ బాధ్యతలు చేపట్టండి నేను ఈ లోకం విడిచి వెడుతున్నాను. తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. దాన్నుంచి విముక్తి కోరుకుంటూ వెళ్లిపోతున్నాను అని భయ్యూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పేరుతెచ్చుకున్న భయ్యూ అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్‌ముఖ్. ఐదుగురు ఆధ్యాత్మిక గురువులతో నర్మదా పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసినందుకుగాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంత్రి పదవిని ఇచ్చినా భయ్యూ తిరస్కరించారు. 2011లో అన్నాహజారే చేపట్టిన దీక్షను విరమింపజేయడానికి రాయబారిగా భయ్యూనే పంపింది ప్రభుత్వం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్, ఉద్దవ్‌ఠాక్రే, గాయనీ మణులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి వారంతా ఆయనకు అభిమానులు. మొదట మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన భయ్యూ, అనంతరం ఆధ్యాత్మికతవైపు తన దారిని మళ్లించుకున్నారు. 2015లో మొదటి భార్య మరణించింది. 2017లో డాక్టర్ ఆయుషి శర్మను వివాహం చేసుకున్నారు. అయితే ఆమెతో కూడా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో మహిళ కూడా భయ్యూ తనను మోసం చేసారంటూ వార్తల్లోకి ఎక్కింది. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవు. భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన భయ్యూ ఎప్పుడూ మెర్సిడెస్‌లో ప్రయాణం చేసేవారు. ఇండోర్‌లో విశాలమైన భవంతి ఉంది. ఈ నేపథ్యంలో భయ్యూ ఆత్మహత్య పలువురిని కలచి వేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మరికొంత మంది ఆధ్యాత్మిక గురువులు భయ్యూ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారించమంటూ పోలీసులను ఆదేశించారు. 

Back to Top