"W/o రామ్" రివ్యూ

- July 19, 2018 , by Maagulf

నటీనటులు : మంచు లక్ష్మి, సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి 
దర్శకత్వం : విజయ్ యలకంటి 
సంగీతం : రఘు దీక్షిత్ 
నిర్మాత : వివేక్ కూచిభొట్ల 
సినిమాటోగ్రఫీ : సామల భాస్కర్

ప్రస్తుతం కొత్త దర్శకులందరూ ప్రేమ కథలను, లేదా బోల్డ్ గా ఉండే ప్రేమ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధిస్తున్నారు. మరో కొత్త దర్శకుడు విజయ్ ఇంతకుముందు రాజమౌళి దగ్గర పని చేశారు. ఇప్పుడు విభిన్నమైన కథాంశంతో మంచు లక్ష్మి హీరోయిన్ గా 'W/o రామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2015లో వచ్చిన 'దొంగాట' తరువాత మంచు లక్ష్మి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ , శ్రీకాంత్ అయ్యర్ , సామ్రాట్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు లక్ష్మి ఇంతవరకు నటించిన చిత్రాలు విమర్శల ప్రశంసలు పొందినా, కమర్షియల్ గా మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయాయి. మరి ఈ సారైనా కమర్షియల్ హిట్ సాధించేందేమో తెలియాలంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'W/o రామ్' చూడాలి.

కథ 
ఒక స్వచ్చంద సంస్థలో పని చేస్తుంది దీక్ష (మంచు లక్ష్మీ). ఆమె భర్త (సామ్రాట్) అనుకోకుండా ఒక ప్రమాదంలో చనిపోతాడు. తన భర్త మరణించడానికి అసలు కారణం ఎవరనేది తెలుసుకోవాలనుకుంటుంది దీక్ష. అందుకోసం పోలిసుల సహాయం కోరుతుంది. కానీ పోలిసుల నుంచి ఎలాంటి స్పందన ఉండదు. దాంతో తానే తన భర్త మరణానికి కారణమైన వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఆధారాలు కూడా సేకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన రాకీ (ఆదర్శ్) అనే వ్యక్తి తన భర్త మరణానికి కారణం అని తెలుస్తుంది. దీక్ష భర్తను రాకీ ఎందుకు చంపాడు ? తన భర్త చావుకు కారణం రాకీ అని ఎలా తెలుసుకుంటుంది దీక్ష ? తన భర్త చావుకు కారణం ఎవరో తెలిశాక ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది దీక్ష ? చివరకు రాకీని ఎలా చేరుకుంటుంది ? ఎం చేస్తుంది దీక్ష ? అనేది తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు : 
దీక్షగా మంచు లక్ష్మి తనదైన శైలిలో నటించింది. భర్త హత్యకు కారణమెవరో తెలుసుకోవడానికి పోలిసుల సాయం కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన భార్యగా, భర్త మరణంతో ఆవేదనకు గురైన మహిళగా తన శక్తి మేర నటించింది లక్ష్మీ. ఇక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించిన ఆదర్శ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. దీక్ష భర్తగా సామ్రాట్ రెడ్డి పాత్ర నిడివి తక్కువే అయినా కథ మొత్తం అతని కోసమే సాగుతుంది. ఇక దీక్షకు విచారణలో సహాయపడే పోలీస్ గా ప్రియదర్శి బాగా నటించాడు. ఇప్పటివరకు ప్రియదర్శి కామెడీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కనిపించేవాడు. కానీ ఇప్పుడు ఒక విభిన్నమైన పాత్రలో నటించాడు. ఇక మిగతా నటీనటులు తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 
దర్శకుడు విజయ్ ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను ఒక పాయింట్ గా తీసుకొని కథను ఆసక్తికరంగా రాసుకున్నారు. ఆ కథను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించి ప్రేక్షకులకు తన పాయింట్ ను చెప్పడంలో విజయం సాధించాడు. పాటలు లేకుండా, కామెడీ లేకుండా ఇలాంటి వైవిధ్యమైన కథను ఎంచుకొని ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేయడమనేది మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా దర్శకుడి ప్రతిభే. ఇక సినిమాకు నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్. రఘు దీక్షిత్ అందించిన నేపథ్య సంగీతం, సామల భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

--మాగల్ఫ్ రేటింగ్ : 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com