కవచం:రివ్యూ

కవచం:రివ్యూ

చిత్రం : కవచం (2018)

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రిన్.. తదితరులు

సంగీతం : ఎస్ ఎస్ థమన్

దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ళ

నిర్మాత : నవీన్ చౌదరి శొంఠినేని

రిలీజ్ డేటు : 7, డిసెంబర్ - 2018.

 

స్టార్ హీరో రేంజ్ సినిమాలు చేసే యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్. ఆయన సినిమాలు భారీతనంతో వస్తుంటాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోయిన్.. తప్పనిసరి. అల్లుడు శ్రీను, స్వీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం.. అన్నీ భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలే. ఐతే, బెల్లకొండకి కమర్షియల్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో బెల్లకొండ కాస్త తగ్గి చేసిన సినిమా 'కవచం'. మీడియం బడ్జెట్ సినిమాగా కవచం తెరకెక్కింది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించారు. కాజల్, మెహ్రీన్ లు హీరోయిన్స్. ఓ మోస్తరు అంచలా మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కవచం' ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

విజయ్‌ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) నిజాయితీ గల పోలీసాఫీసర్. ఎన్‌కౌంటర్‌ స్పెలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్నది విజయ్ కల. ఓ కాఫీ షాప్‌లో పనిచేసే కాజల్‌ తో ప్రేమలో పడతాడు. ఆ విషయం చెప్పేలోపే ఆమెకి పెళ్లి ఫిక్సవుతుంది. దీంతో ఆమె విజయ్ దూరమవుతుంది. అదే సమయంలో ఓ ప్రమాదం నుంచి సంయుక్త (మెహరీన్‌) విజయ్ కాపాడతాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిస్థితుల్లో అసలు సంయుక్త కాజల్ అని తెలుస్తోంది. మరీ.. మెహ్రీన్ ఎవరు ? ఇంతకీ.. సంయుక్త (కాజల్)ని ఎవరు కిడ్నాప్ చేశారు ? దాని వెనక వున్న వ్యక్తి ఎవరు ?? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* యాక్షన్‌

* ఒకట్రెండు ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్

* సంగీతం

* కొన్ని అనవసర పాత్రలు, సన్నివేశాలు

ఎలా ఉందంటే ?

మాస్ - యాక్షన్ కథలకి బెల్లకొండ శ్రీనివాస్ సరిగ్గా సరిపోతాడు. కవచం కూడా ఇలాంటి కథే. దానికి తోడు ప్రేక్షకుడిని ఉత్కంఠకి గురిచేసే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నడపగల అవకాశం ఉన్న కథ. అందుకు తగ్గట్టుగానే కథలో ట్విస్టులని బాగానే రాసుకొన్నాడు దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ. ఐతే, అసలు కథలోకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకొన్నాడు. ప్రీ-ఇంటర్వెల్ తో కథపై ఆసక్తిని పెంచాడు. ఐతే, ఆ హైప్ ని సెకాంఢాఫ్ ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు నిలబెట్టలేకపోయాయి. ఆ తర్వాత హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఐతే, సినిమా పడుతూ.. లేస్తూ.. నడిచింది. దర్శకుడి అనుభవలేమీ స్పష్టంగా కనిపించింది. అయినా.. మాస్, యాక్షన్, పోలీస్ కథలని ఇష్టపడే ప్రేక్షకులని 'కవచం' నిరాశపరచదు.

ఎవరెలా చేశారంటే ?

ఫైట్స్, డ్యాన్సులతో ఇప్పటికే మెప్పించాడు బెల్లకొండ. ఐతే, పోలీసు డ్రెస్ లో యాక్షన్ బెల్లకొండకి బాగా సూటయింది. భాద్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ గా నీతి,నిజాయితీ కలిగిన అధికారిగా ఆయన నటన బాగుంది. క్లైమాక్స్ వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇందులో బెల్లకొండ, విలన్ గా చేసిన నీల్ నితిన్ ముకేశ్ యాక్షన్ అదిరిపోయింది. నాయక-ప్రతినాయకుడు సరితూగినట్టు కుదిరారు. సినిమాలో హీరోయిన్స్ పాత్రకి మంచి ప్రాధ్యాన్యత ఉంది. సినిమాని మలుపు తిప్పే పాత్ర కాజల్ నటించింది. కాజల్-బెల్లకొండ ల మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. మెహ్రీన్ పాత్ర బాగుంది. అందులో ఆమె నటన బాగుంది. మిగితానటీనటులు తమ తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతికంగా :

ఈ మధ్య సంగీత దర్శకుడు థమన్ మంచి ఫాంలో ఉన్నారు. ఐతే, ఆయన స్థాయికి తగ్గ పాటలు కవచం కోసం ఇవ్వలేకపోయాడు థమన్. ఐతే, నేపథ్య సంగీతంలో మాత్రం థమన్ మార్క్ కనిపించింది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. వైజాగ్‌ అందాలు, ఏరియల్‌ షాట్స్‌, యాక్షన్‌ సీన్స్‌లో కెమెరా పనితనం బాగుంది. కొన్నిసన్నివేశాలు సాగదీసినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

బెల్లకొండ శ్రీనివాస్ నుంచి వచ్చిన మరో మాస్-యాక్షన్ ఎంటర్ 'కవచం'. యాక్షన్ ప్రియులు, పోలీస్ కథలని ఇష్టపడే ప్రేక్షకులని కవచం నచ్చతుంది.

 

--మాగల్ఫ్ రేటింగ్ : 2.75/5

Back to Top