విజయ మాల్యాకు జైలు సిద్ధం

- January 06, 2019 , by Maagulf
విజయ మాల్యాకు జైలు సిద్ధం

బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు. ముంబయిలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 ప్రకారం మాల్యాకు పారిపోయిన ఆర్థిక నేరగాడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో గతంలో పిటిషన్‌ వేసింది.

అయితే ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో పాటు ఈడీ అభ్యర్థనపై స్టే విధించాల్సిందిగా మాల్యా గతంలో వేసిన పిటిషన్‌ను పీఎంఎల్‌ఏ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ తీర్పుతో మాల్యాకు సంబంధించిన ఆస్తులన్నీ ఇక ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చు. ఈ చట్టం కింద న్యాయస్థానం ప్రకటించిన తొలి పారిపోయిన ఆర్థిక నేరగాడు మాల్యానే కావడం గమనార్హం.

తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదంటూ గత నెల మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఎదురుదెబ్బే తగిలింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించేందుకు ఈడీ ప్రారంభించిన విచారణ ప్రక్రియపై స్టే విధించాలంటూ మాల్యా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందిగా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం గత నెల తీర్పునిచ్చింది.

మాల్యాపై తప్పుడు కేసులు పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని, అందువల్ల భారత్‌లోని కోర్టులకు మాల్యా సమాధానం చెప్పాలని లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ జడ్జి వ్యాఖ్యానించారు. మాల్యా కోసం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలును సిద్ధం చేశారు. బ్రిటన్‌ నుంచి తీసుకొచ్చిన అనంతరం మాల్యాను ఇక్కడే ఉంచనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com