హీరాగోల్డ్‌ కేసులో అప్డేట్

- January 06, 2019 , by Maagulf
హీరాగోల్డ్‌ కేసులో అప్డేట్

తిరుపతి:రెక్కలు ముక్కలు చేసుకుని, ఆస్తులు, నగలు అమ్మి డిపాజిట్‌ చేసిన సొమ్ము చేతికి వస్తుందో రాదోనని ఆందోళన హీరాగోల్డ్‌ డిపాజిటర్లలో నెలకొంది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా, తిరుపతి ఉపకేంద్రంగానూ పదిహేనేళ్లుగా నడుస్తున్న హీరాగోల్డ్‌ ఎగ్జిమ్‌ లిమిటెడ్‌ కంపెనీ పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇందులో డిపాజిట్ల సేకరణ ముఖ్యమైనది. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే నెలకు రూ. 2700నుంచి రూ. 3500 వరకు ఆదాయ రూపంలో డిపాజిటర్ల ఖాతాల్లో సంస్థ జమ చేస్తూ వచ్చింది. పదేళ్ల వరకు డిపాజిట్ల సేకరణ ప్రచారానికి దూరంగా ఒకరిని చూసి మరొకరు చాపకింద నీరులా వ్యాపించింది. అయితే నాలుగైదేళ్లుగా డిపాజిటర్ల ఖాతాల్లో జమ అవుతున్న ఆదాయానికి ఆకర్షితులై వందలాది మంది లక్షల రూపాయల్లో డిపాజిట్లు చేశారు.

డిపాజిట్‌ చేసిన వారికి నెలనెల ఠంచనుగా ఖాతాల్లో నగదు జమయ్యేది. ఈ విధంగా సాగుతున్న హీరాగోల్డ్‌ డిపాజిట్ల పథకం ఆదాయ చెల్లింపులు గత మే నెల నుంచి ఆగిపోయాయి. దీంతో డిపాజిటర్లలో అనుమానాలు, ఆందోళనలు తలెత్తాయి. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో పోలీసు కేసులు కూడా నమోదు కావడం, మూడున్నర నెలల క్రితం హీరాగోల్డ్‌ సంస్థల అధినేత్రి షేక్‌ నౌహీరా అరెస్టుకు గురికావడం డిపాజిటర్లను మరింత ఆందోళనకు లోను చేసింది. దేశవ్యాప్తంగా హీరాగోల్డ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో డిపాజిటర్లు తమ సొమ్ములు వస్తాయో రావోనని దిగాలు చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన కేసులను పోలీసులు సీఐడీకి బదిలీ చేయడం, హైదరాబాద్‌లో అరెస్టు చేసిన హీరాగోల్డ్‌ అధినేత్రి షేక్‌ నౌహీరాకు బెయిల్‌ మంజూరైనప్పటికీ కేసుల నిమిత్తం ముంబైకి తరలించడం తదితర పరిణామాలు డిపాజిటర్లను డోలాయమానంలో పడేసింది.

ముంబై నుంచి షేక్‌ నౌహీరాను కేసుల నిమిత్తం గురువారం చిత్తూరు కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో ఇంత కాలం ఎక్కడుందో, ఎలా ఉందోనని హీరా గోల్డ్‌ సంస్థ అధినేత్రి గురించి ఆదుర్దా పడిన డిపాజిటర్లలో మరింత టెన్షన్‌ పెరిగింది. ఆమెను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారనే సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా గురువారం మధ్యాహ్నానికే తెలుసుకున్న డిపాజిటర్లు ఆమెను చిత్తూరులోనే పెడతారా లేక మరో ఊరి పోలీసులు తీసుకువెళాతారా అన్న టెన్షన్‌ కనిపించింది. కోర్టు రిమాండ్‌కు ఆదేశించడంతో ఆమెను చిత్తూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఆమె మీద ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు పలు కేసులు నమోదు చేసిన దరిమిలా ఆమెను వివిధ కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను చిత్తూరు కోర్టులో హాజరు పరిచారు. తమ డిపాజిట్ల గురించి ఇంత వరకు ఆ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం, ప్రకటన లేక జిల్లాలోని డిపాజిటర్లు తమ సొమ్ము వెనక్కు వస్తుందో రాదోనన్న ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె జిల్లాలోనే ఉన్నందున ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన వస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు.

అధిక ఆదాయం ఆశ చూపించి హీరా గోల్డ్‌ సంస్థ దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. మొదట్లో కేవలం పేద, మధ్యతరగతి వారు మాత్రమే డిపాజిట్లు చేయగా వారిని చూసి సంపన్నులు కూడా మొగ్గు చూపారు. పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే తమ ఇళ్లలోని బంగారాన్ని, తాము కొన్న భూముల్ని సైతం తెగనమ్మి ఆ సొమ్మును హీరా గోల్డ్‌లో డిపాజిట్‌ చేసే వరకు వచ్చింది. ఈ క్రమంలో జిల్లాలోనే దాదాపు రూ. వెయ్యి కోట్ల దాకా ఆ సంస్థలో డిపాజిట్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గుర్రంకొండ, మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు, పులిచెర్ల, కలికిరి, కలకడ తిరుపతి, రొంపిచెర్ల మండలాల ప్రజలు ఇందులో ఎక్కువగా ఉన్నారు. డిపాజిటర్లు అందరూ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.

షేక్‌ నౌహీరా అరెస్టు కావడంతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ అధిక శాతం మంది డిపాజిటర్లు ఆమెపై నమ్మకంతో తమ డబ్బు ఎక్కడికీ పోదన్న ధైర్యంతో ఉండిపోయారు. అయితే అదే సమయంలో సోషల్‌ మీడియాలో హీరా గోల్డ్‌ సంస్థపై పెద్ద ఎత్తున వార్తలు వైరల్‌ కావడంతో అనుమానాలు కాస్తా ఆందోళనలుగా మారాయి.

డిపాజిట్లు చేసిన వారు హీరా గోల్డ్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ పెట్టుబడుల విషయమై ఆరా తీశారు. అయితే ఈ విషయమై డిపాజిటర్ల అనుమానాలు తొలగించే రీతిలో సమాధానాలు రాకపోవడం, పలు ప్రాంతాల్లో డిపాజిటర్లు ఆందోళనలకు దిగడం, డిపాజిట్‌ చేసిన మొత్తాలను వాపసు చేయాలని దరఖాస్తులు చేసుకోవడం, నెలలు గడిచినా సొమ్ము చేతికి అందకపోవడం, వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో డిపాజిటర్లలో భయం నెలకొంది. ఈ తరుణంలో హీరా గోల్డ్‌ సంస్థ కూడా మరో అగ్రిగోల్డ్‌ సంస్థ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగడంతో జిల్లాలోని డిపాజిటర్లలో ఆందోళన మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కలకడ పోలీ్‌సస్టేషన్‌లో ఇద్దరు డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్‌ సంస్థపై రెండు ఛీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిని సీఐడీకి బదిలీ చేయడం కూడా జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com