"యన్.టి.ఆర్‌ -కథానాయకుడు" మూవీ రివ్యూ

- January 09, 2019 , by Maagulf

ఎన్టీఆర్ కేవలం తెలుగు వారి అభిమాన నటుడు మాత్రమే కాదు. తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహోన్నత నాయకుడు. వెండితెరపై జానపద, పౌరాణిక, సాంఘిక. ఇలా జోనర్ ఏదైనా తనదైన నటనతో చెరగని ముద్రవేసిన గొప్ప నటుడు. ఆయన పోషించినన్ని పౌరాణిక పాత్రలు మరో నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేజీలు సువర్ణాక్షరాలతో లిఖించదగనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ ప్రస్థానంలో ఎలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్య మంత్రి స్థాయికి ఎదిగిన తీరును ఎవరూ మర్చిపోలేరు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే ఇది. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించిన యన్‌.టి.ఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎన్టీఆర్‌గా బాలకృష్ణ ఎలా మెప్పించారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటన ఎలా ఉంది? ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఎలా సాగింది?

కథ:
క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ తారకం (విద్యా బాలన్) తనతో పెళ్లి తర్వాత రకరకాలుగా మలుపులు తిరిగిన భర్త జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. స్వాతంత్రం అనంతరం రిజిస్టరాఫీసులో ఉద్యోగంలో చేరి.. అక్కడ అవినీతిని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆపై సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎలా వెండి తెర ఇల వేల్పుగా ఎదగడం.. ఆపై రాజకీయాల వైపు అడుగులేయడం.. ఇలా ఆయన జీవితాన్ని తరచి చూపిస్తూ సాగే కథ ఇది.

అలజడి విశ్లేషణ:

గత ఏడాది సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన 'మహానటి' బయోపిక్ లకు కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించింది. తర్వాత ఏ బయోపిక్ వచ్చినా కూడా దాంతో పోల్చి చూసే పరిస్థితి ఉందిప్పుడు. ఐతే అందరి కథల్లోనూ సావిత్రి జీవితంలో ఉన్నంత డ్రామా.. మలుపులు ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ కథనే తీసుకుంటే ఆయన సినీ జీవితంలో ఎత్తులే తప్ప పల్లాలనేవి కనిపించవు. ఆరంభంలో కొంచెం ఒడుదొడుకుల్ని మినహాయిస్తే ఆయన సినీ ప్రయాణమంతా సాఫీగా సాగిపోయిందే. ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతూ వెళ్లాడే తప్ప.. ఎన్టీఆర్ ఏనాడూ తన సినీ జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎదుగుదల ఎలా సాగిందన్నది అందరికీ తెలిసిన వ్యవహారమే. రాజకీయ రంగంలో అయినా ఎత్తుపల్లాలున్నాయి కానీ.. సినీ ప్రయాణంలో మాత్రం ఎన్టీఆర్ కు ఎదురన్నది లేదు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎలా చూపిస్తారనే విషయంలో అనేక సందేహాలున్నాయి. ఐతే అదంతా 'యన్.టి.ఆర్-మహా నాయకుడు'కు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు చర్చ అనవసరం.

ఇక ఎన్టీఆర్ సినిమా కెరీర్ తో పాటు.. ఆయన రాజకీయాల వైపు అడుగులేసే వరకు చూపించిన చిత్రం 'యన్.టి.ఆర్-కథానాయకుడు'. కథ పరంగా ఇందులో ఎగ్జైట్ చేసే అంశాలు చాలా తక్కువ. కాకపోతే క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడుండటం వల్ల తెలిసిన విషయాలే తెరపై కొంచెం అందంగా.. ప్రభావవంతంగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ ను ఇష్టపడేవాళ్లకు ఆయన కథను ఇలా చూసుకోవడం మహదానందం కలిగిస్తుంది. మిగతా సగటు ప్రేక్షకుల్ని కూడా ఓ మోస్తరుగానే ఎంగేజ్ చేస్తూ సాగుతుంది 'యన్.టి.ఆర్'. పెద్దగా మలుపుల్లేని ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్ని.. నటీనటులు.. సాంకేతిక నిపుణుల అండతో క్రిష్ ప్రభావవంతంగానే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కథ పరంగా మాత్రం ఇందులో ఎగ్జైట్ అయ్యే అంశాలు పెద్దగా లేకపోవడం బలహీనత. ఇక ఎన్టీఆర్ పాత్రలో కనిపించడానికి నందమూరి బాలకృష్ణ పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది కానీ.. యంగ్ ఎన్టీఆర్ గా సగం సినిమా వరకు ఆ పాత్రలో చాలా ఎబ్బెట్టుగా కనిపించి తెగ ఇబ్బంది పెట్టేశాడు. కానీ వయసు మళ్లిన ఎన్టీఆర్ గా మాత్రం బాలయ్య అభినయం మెప్పిస్తుంది. ముఖ్యంగా సినిమాలతో సంబంధం లేకుండా మామూలుగా కనిపించే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్.. నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

'యన్.టి.ఆర్'లో సగటు ప్రేక్షకులు ఆశించే హై పాయింట్స్ పెద్దగా లేవు. ముఖ్యంగా ప్రథమార్ధంలో మలుపులు.. కొత్త విషయాలేమీ లేకపోవడం.. కథ మరీ ఫ్లాట్ గా సాగిపోవడం వల్ల ప్రేక్షకులకు ఒక దశ దాటాక బోర్ కొడుతుంది. సినీ రంగంలో ఎన్టీఆర్ ముద్ర గురించి చూపించే రెండు మూడు ఎలివేషన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి 'మాయా బజార్' సినిమా కోసం తొలిసారి కృష్ణుడి పాత్రలోకి ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేయడం. ఈ సన్నివేశంలో క్రిష్ బలమైన ముద్ర వేశాడు. ఈ సన్నివేశానికి రాసిన లీడ్.. చిత్రీకరణ.. బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా గొప్పగా కుదిరి ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం కలుగుతుంది. అలాగే 'సీతా రామ కళ్యాణం' సినిమాతో దర్శకత్వం చేపట్టిన ఎన్టీఆర్ ఆ సినిమా కోసం పడ్డ కష్టం.. ఆపై 'దాన వీర శూర కర్ణ' కోసం చేసిన సాహసం.. వీటికి సంబంధించిన ఎపిసోడ్లను బాగా చిత్రించారు. ఇంతకుమించి సినిమాలో హై పాయింట్స్ కనిపించవు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ మరణానికి సంబంధించిన ఎమోషనల్ సీన్ కొంచెం కదిలిస్తుంది. ప్రథమార్ధం వరకు అయితే కృష్ణుడి సీన్.. కొడుకు మరణానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి. యుక్త వయసులో ఉన్న బాలయ్య సెట్టవ్వకపోవడం వల్ల ప్రథమార్ధంలో చాలా సీన్లు అంత ప్రభావవంతంగా అనిపించవు.

ఐతే వయసు మీద పడ్డ ఎన్టీఆర్ కు బాలయ్య ఇట్టే సెట్టయిపోవడంతో ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు పండాయి. ముఖ్యంగా రెండో అర్ధంలో సినిమాల బయట ఎన్టీఆర్ జీవితాన్ని చూపించడం వల్ల కథ కూడా కొంచెం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఏఎన్నార్ తో ఎన్టీఆర్ స్నేహం.. వాళ్లిద్దరి అనుబంధానికి సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాగే జనాల బాధల్ని.. రాజకీయ పరిస్థితుల్ని చూసి ఎన్టీఆర్ లో అంతర్మథనం మొదలై రాజకీయాల వైపు అడుగులేసే సన్నివేశాలు కూడా బాగానే తెరకెక్కించారు. ఈ సన్నివేశాల్లోనే సినిమా స్థాయి పెరుగుతుంది. దర్శకుడిగా క్రిష్ పట్టు కూడా ఇక్కడే కనిపిస్తుంది. అక్కడక్కడా కథనంలో వేగం మరీ నెమ్మదించినప్పటికీ.. 'యన్.టి.ఆర్'లో కథంటూ కనిపించేది.. కథనం ఆసక్తికరంగా నడిచేది మాత్రం ద్వితీయార్ధంలోనే. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఉత్తేజితుల్ని చేసే ఒక సన్నివేశంతో సినిమాను బాగానే ముగించారు. 'యన్.టి.ఆర్-మహా నాయకుడు'లో ఎంత వరకు నిజాలు చూపిస్తారన్నది పక్కన పెడితే.. ఈ సినిమా ముగింపుతో దానికి ఇచ్చిన లీడ్ మాత్రం బాగుంది. కథ పరంగా 'యన్.టి.ఆర్-కథానాయకుడు'లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు కానీ.. ఉన్నంతలో ఈ కథను క్రిష్ అండ్ టీం ఎంగేజ్ చేసే లాగే చెప్పగలిగింది.

నటీనటులు:
ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపై చూపించడం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి పాత్రకు ఒక ఔచిత్యం ఉంది. దానికి తగిన నటీనటులను ఎంచుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు క్రిష్‌, అతని బృందం నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. ప్రతి పాత్రా పోత పోసినట్లే అనిపిస్తుంది. చాలా పాత్రలు కేవలం ఒక్క సన్నివేశానికి మాత్రమే పరిమితమైనవే. అయినా, అలాంటి సన్నివేశాలు కూడా రక్తికట్టాయి. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ.. ఎన్నో విభిన్న గెటప్పుల్లో కనిపించారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి పాత్రల్లో బాలకృష్ణని చూడటం అభిమానులకు నిజంగా పండగలా ఉంటుంది. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో బాలకృష్ణ కనిపించిన సన్నివేశాలు అంతగా అతకలేదేమో అనిపిస్తుంది. బాలకృష్ణ వయసు రీత్యా ఆ ఇబ్బంది ఉండేదే! ఒక వేళ ఆ పాత్రలు మరొకరు చేసి ఉంటే, అభిమానులు ఎలా తీసుకుంటారోనన్న భయంతో చిత్ర బృందం రిస్క్ చేయలేదేమో! బసవతారకంగా విద్యాబాలన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవడమే ఈ సినిమాకు ప్రధాన బలం. ఎందుకంటే ఇది బసవతారకం కథ కాబట్టి. ఈ పాత్ర తర్వాత అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునేది అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అక్కినేనిగా సుమంత్ చాలా చక్కగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఏయన్నారేమోననిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్టీఆర్‌-ఏయన్నార్‌ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్కరించారు. ఒక రకంగా ఏయన్నార్ బయోపిక్‌లా కూడా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో కనిపించే మరో ముఖ్యమైన పాత్ర త్రివిక్రమరావు. ఆ పాత్రలో దగ్గుబాటి రాజా చక్కగా నటించారు. చంద్రబాబుగా రానా పాత్ర చివరిలో తళుక్కున మెరుస్తుంది. ద్వితీయార్థానికి ఆ పాత్ర ఆయువుపట్టు అని అప్పుడే తెలిసిపోతుంది. పేరున్న నటీనటులందరూ చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, ఆ పాత్రల విశిష్టతను పెంచారు.

ప్లస్ పాయింట్స్:
ఎన్టీఆర్ ఎదిగిన తీరు, గెటప్పులు
ఎన్టీఆర్‌, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు
మాటలు

మైనస్ పాయింట్స్:
నిడివి ఎక్కువగా ఉండటం
పంచ్ లైన్: 'యన్.టి.ఆర్‌ -కథానాయకుడు' జయహో కథానాయకా!

మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 4/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com