తెలంగాణ:రేపే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం

- February 18, 2019 , by Maagulf
తెలంగాణ:రేపే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం

తెలంగాణ:సామాజిక సమీకరణాలు, జిల్లాల లెక్కలు, జూనియర్‌, సీనియర్ల కలబోతతో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కసరత్తు పూర్తైంది. రేపు రాజ్‌భవన్‌ వేదికగా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే ఇన్ని రోజులు పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్లు, మాజీ మంత్రులకు తాజా మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందా లేదా అన్నదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

 

తొలి కేబినెట్ విస్తరణలో మొత్తం 8 నుంచి 10 మందికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. అయితే ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు మాత్రం చోటు లేదని తెలుస్తోంది..ఇప్పటికే మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు సీఎం కేసీఆర్.

కేబినేట్‌ చోటు దక్కించుకుంటున్న వారిలో హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్,నల్గొండ నుంచి జగదీశ్‌ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఉండగా.. కొత్తగా బెర్త్‌ దక్కించుకున్న వారిలో వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావ, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ మంత్రి ఈటలకు ఈసారి మంత్రి పదవి కేబినేట్‌ బెర్త్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈటలకు బెర్త్‌ దక్కుతుందా లేదా అన్నదానిపై ఇప్పటికి సమాచారం లేదు. రేపటి మంత్రి వర్గ విస్తరణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు హరీష్‌రావుకు చాన్స్‌ లేనట్లు సమాచారం. పార్లమెంట్‌ తరువాతే వీరిద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక వీరితో పాటు కీలక నేతలైన కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు కూడా మంత్రి వర్గ విస్తరణలో చోటు లేదని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com