జెట్ ఎయిర్వేస్ కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ బిడ్..
- May 11, 2019
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో నిర్వహణ వ్యయం లేక ఇబ్బంది పడుతూ తాత్కాలికంగా మూత పడిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను ఆదుకొనేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు ఎతిహాద్ ఎయిర్వేస్ ముందుకు వచ్చింది. జెట్ సంస్థలో ఇప్పటికే దాదాపు 25 శాతం వాటా కలిగిన ఎతిహాద్ సంస్థ మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు శుక్రవారం చివరిక్షణంలో బైండింగ్ బిడ్ దాఖలు చేసింది, అయితే సంస్థ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం మైనారిటీ భాగస్వామి కావాలని పేర్కొంది.
జెట్ ఎయిర్వేస్లో మెజార్టీ వాటా నిమిత్తం టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. అయితే ఇందులో ఎతిహాద్ ఎయిర్వేస్ బిడ్ పూర్తిస్థాయిలో అర్హత కలిగి ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ సంస్థ జెట్ కోసం బైడింగ్ బిడ్‌ను దాఖలు చేసిందని తెలుస్తోంది.
జెట్ ఎయిర్వేస్ సంస్థలో వాటా కొనుగోలుకు సంబంధించి బిడ్లను సమర్పించేందుకు గడువు మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పరిణామంపై మార్కెట్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే మరో 6 వారాల్లోనే జెట్ విమానాలు మళ్లీ గాలిలోకి ఎగిరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
జెట్ ఎయిర్వేస్ సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు తాము సుముఖంగానే ఉన్నా.. సదరు వాటా నిమిత్తం మొత్తంగా పెట్టుబడి పెట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా లేదని ఎతిహాద్ తెలిపింది.ఇందుకు భారత్‌లోని ఇతర సంస్థల వారితో భాగస్వామ్యం నిమిత్తం చర్చలు జరుపుతున్నామని తెలిపింది.
భారత్‌లో వాయు రవాణా వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అంతేకాక తమ మాతృ దేశం యూఏఈకి భారత్ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక భాగస్వామి అయినందున జెట్‌పై తాము ఆసక్తి కనబరుస్తున్నట్టు ఎతిహాద్ వివరించింది. జెట్‌ను నిలిబెట్టేందుకు గాను కీలక భాగస్వామి అన్వేషణను తాము గత 15 నెలలుగా కొనసాగిస్తున్నామని సంస్థ తెలిపింది.
జెట్ ఎయిర్వేస్ సంస్థలో సమస్య పరిష్కారానికి తమ ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని ఎతిహాద్ వివరించింది. అన్ని తాము అనుకున్నట్టుగా జరిగితే కొద్దిరోజుల్లోనే జెట్ మళ్లీ గాలిలో ఎగురవచ్చని సంస్థ తెలిపింది.
మరోవైపు జెట్ ఎయిర్వేస్ మూతతో రోడ్డున పడ్డ ఉద్యోగుల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసారు. తమకు వేతనాలు తక్కువైనా పర్వాలేదు కానీ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాలని కోరారు. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ మే 23 తరువాత ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు.
అంతకు ముందు కంపెనీ ఉద్యోగులు ప్రధాన మంత్రి కలిసి సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ జెట్ ఎయిర్వేస్ కోసం వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారం ఉన్న ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు రెండు బిడ్లు వచ్చాయని ఎస్బీఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు