అస్తమించిన గొల్లపూడి మారుతీ రావు

- December 12, 2019 , by Maagulf
అస్తమించిన గొల్లపూడి మారుతీ రావు

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా గొల్లపూడి సుపరిచితులు. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకొన్నారు. 14 ఏళ్లకే రచయితగా పుస్తకాన్ని రాశారు. డైలాగ్ డెలీవరిలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న గొల్లపూడి వయోభారం కారణంగా కొద్ది రోజులుగా సినిమాలకు దూరమయ్యారు. 

మొదట రచయితగా ఆ తర్వాత నటుడిగా
మొదట రచయితగా ప్రసిద్ది చెందిన గొల్లపూడి మారుతీ రావు, ఆ తర్వాత సినిమాల ద్వారా అందరికీ సుపరిచితుడయ్యారు. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో గొల్లపూడిది ప్రత్యేక శైలి. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పని చేశారు. 

గొల్లపూడి మారుతీ రావు జననం.. ఇతర వివరాలు
గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వీరు విశాఖపట్టణంలో జీవించే వారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ (ఆనర్స్) చేశాడు. 

రచయితగా, నటుడిగా మారుతీరావు
14 ఏళ్ల వయసులోనే ఆశా జీవి అనే తన తొలి కథ రాశారు గొల్లపూడి. డైరెక్టర్ కె. విశ్వనాథ్ తొలి సినిమా 'ఆత్మగౌరవం' చిత్రానికి గొల్లపూడి రచయితగా ఉన్నారు. 1963లో 'డాక్టర్ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. రచయితగా మారుతీరావుకు అదే తొలి సినిమా. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆయన నటించిన చివరి చిత్రం జోడీ. 

250 చిత్రాలకు పైగా.. ముఖ్య సినిమాలు
290 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయన నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com