సమర్ధవంతమైన సేవలకు ఈ-ఆఫీసులు అత్యంత కీలకం:తెలంగాణ గవర్నర్

- August 26, 2020 , by Maagulf
సమర్ధవంతమైన సేవలకు ఈ-ఆఫీసులు అత్యంత కీలకం:తెలంగాణ గవర్నర్

హైదరాబాద్:ఈ-ఆఫీసు విధానం ద్వారా సేవలందించడం వలన పౌరులకు సేవలందించడంలో వేగం, జవాబుదారితనం, పారదర్శకత పెంపొందుతాయని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.ప్రభుత్వ పాలనలో సాధ్యమైనన్ని ఎక్కువ స్ధాయిలలో ఈ-ఆఫీసు పద్ధతి ద్వారా ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. 
ఈ-ఆఫీసు విధానంలో పేపర్ లెస్ పాలన భాగం కానట్టి చెట్లు కొట్టివేయడం తగ్గుతుందని, దీని ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు. 

ఈ-ఆఫీస్, ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన చట్టబద్ధమైన సేవలు సులభతరంగా, హక్కుగా పొందుతారని ఇది వారిని సాధికారత వైపు నడిపిస్తుందని డా. తమిళిసై స్పష్టం చేశారు. 
రాష్ట్ర ప్రభుత్వ ఐటి, ఈసి విభాగం జాయింట్ సెక్రటరి పెండ్యాల శ్రీనివాస్, ఇతర అధికారులు ఈ-ఆఫీస్ విధానంపై ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి శ్రీకారం చుట్టిన డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా మన దేశం ఇప్పటికే డిజిటల్ విద్య, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-గవర్నెన్స్ దిశగా ముందంజలో ఉందన్నారు. 

కోవిడ్-19 సంక్షోభం డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచింది. మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. డిజిటల్ సాంకేతిక వినియోగంతో పాలనను, జీవితాన్ని సులభతరం చేయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఈ-ఆఫీస్ పాలనతో విద్యార్ధులకు సమర్ధవంతమైన, సత్వర సేవలందించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘు ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com