సంక్రాంతి లక్ష్మి

- May 27, 2015 , by Maagulf
సంక్రాంతి లక్ష్మి

భూలోకపు దినపతియగు భానుడికే  కానుకగా

ఉత్తర దిశ  పయనించే దినమే ఒక వేడుకగా

రంగవల్లి రంగులతో రంగిల్లే ముంగిళ్లతో

ముంగిళ్లను మురిపించే  ముచ్చ టైన గొబ్బిళ్లతో

  

రారమ్మని  రారమ్మని స్వాగతాలు పలుకుచుండ

సంక్రాంతి లక్ష్మి వచ్చింది  సంబరాల సందడితో             II రారమ్మని II

 

నిడి వీధిలొ హరిదాసుల మధుర మైన పాటలతో

నడి వీధిన అలుపెరుగని గంగిరెద్దు ఆటలతో

నింగి కెగసి నటన మాడు రంగుల  పతంగులతో

రంగ మెత్తి పొంగి పోరు కోడి పుంజు పందెములతో                   II రారమ్మని II

 

భోగి పళ్ళు పోసుకున్న పసి పాపల నవ్వులతో

పరికిణీలు  వేసుకున్న పెద పాపల రువ్వులతో

కొత్త పంట ఇంట జేర్చు రైతన్నల  సంపదతో

సంపదలో సాయ పడిన బసవన్నల బలగంతో                       II రారమ్మని II

 

చలి పులినే హడలించే  వడి భోగి మంటలతో

కడుపారగ భుజియించె  కనుమ రోజు వంటలతో

బంధు మిత్ర సపరివార సంతోషపు సవ్వడితో

మమతలతో ముంచెత్తే మన అందరి లోగిళ్ళకు             II రారమ్మని II

 

 

                                                                          …నక్క భాస్కర రావు

                                                      అబుధాబి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com