సుస్థిరమైన, లాభసాటి వ్యవసాయం దిశగా దృష్టి కేంద్రీకరించాలి-ఉపరాష్ట్రపతి
- December 17, 2020
కోయంబత్తూర్:రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధర లభించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు, కోట్లాది మందికి ఆహార భద్రతను, పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
శుక్రవారం కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ 41వ స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి స్నాతకోపన్యాసం చేశారు. వరదలు, కరువు, ఊష్ణోగ్రత, వివిధ తెగుళ్లు, క్రిమిసంహారక మందుల ప్రభావాన్ని తట్టుకునే కొత్త వంగడాలను సృష్టించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్న ఆయన, అన్ని ప్రతికూల వ్యవసాయ పరిస్థితులను తట్టుకునే వంగడాల ద్వారా భారతీయ వ్యవసాయాన్ని లాభసాటిగా, సుస్థిరంగా మార్చే దిశగా మార్గం సుగమం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో వాతావరణ మార్పుల దుష్ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంపై కనిపించే ప్రభావాల గురించి అప్రమత్తం చేస్తూ.. చిన్న, మధ్యతరగతి రైతుల కష్టాలను తగ్గించే సాంకేతిక పద్ధతులను వృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు.
వ్యవసాయాన్ని ఓ పవిత్రమైన, బాధ్యతాయుతమైన వృత్తిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని తెలిపారు. భారతదేశ సంస్కృతి, నాగరికతలో వ్యవసాయం అంతర్భాగంగా ఉందన్న ఆయన, నేటికీ భారతదేశంలో 50శాతం మందికి పైగా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారన్నారు. అలాంటి వ్యవసాయాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వనరులను సద్వినియోగం చేసుకుంటూ, ఉత్పత్తి పెంచే చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని నిల్వ చేయగలిగే మౌలికవసతులను కూడా మరింతగా పెంచుకోవాల్సి ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రైవేటు రంగం కూడా చొరవతీసుకోవాలని సూచించారు.
కరోనా మహమ్మారి సమయంలోనూ రైతులు చూపిన చొరవ కారణంగా భారతదేశం రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తిని నమోదు చేసిందని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఎన్నిసవాళ్లు ఎదురైనా అన్నదాతలు అన్ని అడ్డంకులను ఎదుర్కొని ముందుకెళుతున్నారన్న ఆయన, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలుతో 72శాతం మంది భారతీయ రైతులకు లబ్ధిచేకూరుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో పరిశోధలను మరింత విస్తృతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఆ పరిశోధనల ఫలాలు రైతులకు చేర్చడంపైనా దృష్టిపెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు సూచించారు. సంప్రదాయ భారతీయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుంటుందని తెలిపారు.
తమిళనాడు జలనిర్వహణ, వ్యవసాయ విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. కొత్త వంగడాలను ప్రోత్సహించడంతోపాటు ఉత్పత్తిని పెంచేందుకు అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలో తమిళనాడు రాష్ట్రం చూపిస్తున్న చొరవను అభినందించారు. సాంకేతిక ఆధారిత సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కృషిచేయాలని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, రైతుల ఆదాయం రెట్టింపుచేయడంతోపాటు ఆహార, పౌష్టికాహార భద్రతకు కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ఉన్నతవిద్యాశాఖ మంత్రి కేపీ అన్బగళన్, పశుసంవర్ధక శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. కుమార్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







