వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీం కోర్టు
- January 12, 2021
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తమకున్న అధికారాల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 'మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది' అని చెప్పారు. రైతులు కమిటీ వద్దకు వెళ్లరన్న దానిపై వాదనలు తాము వినదలచుకోలేదని, మీరు (రైతులు) నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని అన్నారు.
అందరూ వస్తున్నారు.. మోదీ రారేం?
రైతుల తరఫున వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలు వినిపిస్తూ, కోర్టు ఏర్పాటు చేసే ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు కోర్టుకు విన్నవించారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ ప్రధాన వ్యక్తి అయిన ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అంటున్నట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సీజేఐ స్పందిస్తూ... 'ప్రధానిని చర్చలకు వెళ్లమని మేము చెప్పలేం. ఈ కేసులో ఆయన పార్టీ కాదు' అన్నారు. తమకున్న అధికారులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగలమని, జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ అని, చిత్తశుద్ధితో పరిష్కారం కోరుకునే రైతులు కమిటీ ముందుకు వెళ్లవచ్చని సీజేఐ పేర్కొన్నారు.
అటార్నీ జనరల్‌కు సీజేఐ సూటి ప్రశ్న...
రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని ఆయన పేర్కొంటూ, అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా, కాదంటారా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ, నిరసనల్లోకి ఖలిస్థానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







