లాక్ డౌన్ కష్టాలు...'రుక్మిణి' మాటల్లో

- March 05, 2021 , by Maagulf
లాక్ డౌన్ కష్టాలు...\'రుక్మిణి\' మాటల్లో

రమణ రావు, సత్యవతిల రెండో సంతానం రుక్మిణి.ఇంట్లో అందరి కంటే చిన్నది అవ్వటం మూలాన, వాళ్ళ నాన్న కొంచెం ఏంటి, గారాబం ఎక్కువే  చేసాడు.ఎం.ఏ వరకు చదివింది. చూడటానికి  ఎర్రగా, సన్నగా,పొడుగ్గా ఉంటుంది. ఇటు తీసిన పూచిక పుల్ల అటు  పెట్టదు.కొంచెం పెంకితనం, ఇంక్కొంచెం గడుసుతనం. అక్క పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.ఒక ఏడాది తర్వాత, వాళ్ళ నాన్న తనకి కూడా సంబంధాలు చూడటం మొదలెట్టాడు. ‘ నాకు ఏ ఫారిన్ సంబంధాలు చూడకండి,అక్కడ పని వాళ్ళు ఉండరు, అన్ని పనులు నేనే చేసుకోవాలి,  మీరు ఇచ్చే కట్నంతో ఇక్కడే మాంచి సంబంధం చేసుకుని సుఖపడచ్చు’ అని వాళ్ళ నాన్నతో కరాఖండి గా చెప్పేసి, “అంటే మీకు దగ్గర గానే ఉంటాను కదా అని...” చెప్పి తన  తెలివితేటలుకి తానే మురిసిపోయింది. కని పెంచిన వాళ్ళు,వాళ్లకి ఆ  మాత్రం తెలీదా రుక్మిణి సంగతి.

కొన్నాళ్లకి, ఒక్కడే కొడుకు, పొలం పుట్రా ఉండి,ఇంజనీరింగ్ చదివి నెలకి డెబ్భయి వేలు సంపాదిస్తున్న వామన రావుతో పెళ్లి అయ్యింది. ఏ బరువు బాధ్యతలు లేవు. ఇండిపెండెంట్ కాపురం. ఇప్పటికి పెళ్లి అయ్యి ఎనిమిది ఏళ్ళు అయ్యింది, , ఇద్దరు కొడుకులతో  సంసారం పెరిగింది. వామన రావు జీతం కూడా బానే పెరిగింది. పనిమనిషి లేందే రోజు గడవదు. కార్లు, షికార్లు, హోటళ్లుతో జీవితం జోరుగా, హుషారుగా సాగిపోతున్న తరుణంలో  వచ్చింది కరోనా మహమ్మారి.

చిన్నపాటి రొంప చేస్తేనే  డాక్టర్ దగ్గరకి రెండు సార్లు పరిగెత్తి, నాలుగు రోజులు మంచం ఎక్కి ముసుగు తన్నేస్తుంది. అలాంటిది కరోనా! వాక్సిన్ లేదు, మందులు లేవాయే. ఎవరికీ ఉందొ, ఎవరికీ లేదో, తెలీదు. టెస్ట్ చేయించుకోరు. వామ్మో! హాస్పిటల్ కి వెళ్తే డబ్బులు గుంజేస్తున్నారు, తగ్గటం మాట దేవుడెరుగు.రోజు ఇలాంటి ఆలోచనలతో రుక్మిణి బుర్ర గిర్రున తిరుగుతోంది. 

మార్చిలో,  కరోనా ఆంధ్రాలో మొదలయ్యిందో లేదో, ఇక్కడ వెంటనే రత్తాలుని, మాన్పించేసింది. మొత్తం ఇంటి పని, వంట పని చెయ్యటం బొత్తిగా అలవాటు లేదు రుక్మిణికి. రత్తాలుని పని మాన్పించాక, ‘నువ్వు  సాయం చెయ్యక్కర్లేదు, ఈ మాత్రం నేను చెయ్యలేను’ అని భర్తతో డాంబికాలు పోయింది. పట్టుమని నాలుగు రోజులు మొత్తం ఇంటి పని, వంట పని చేసుకోలేక పోయింది. మామూలుగా వంట బానే చేస్తుంది, కానీ పని ఒత్తిడి, టెన్షన్ మూలాన సాంబార్ చేస్తే కారం రొడ్డు అయ్యింది, కూర  చేస్తే ఉప్పు కషాయం అయ్యింది, పప్పు చేస్తే చారు అయ్యింది, పచ్చడి చేస్తే ఇంకేదో అయ్యింది.వామన రావు మాట్లాడకుండా గమ్మున తినేసాడు. పిల్లలుకి కళ్ళవెంట , ముక్కెమ్మట ఒకటే నీళ్లు. ఐదో రోజు నుంచి  పొద్దున్న,సాయంత్రం అన్నంలోకి చారు(ఏమన్నా అంటే, కరోనా కదా ఇమ్మ్యూనిటికి అంది),రెండు రోజులకో సారి ఒకటే కూర చేసి  కొడుతోంది.

ఇమ్మ్యూనిటి పెరగాలని, అతి భయంతో , పొద్దున్న, వేపాకు పసుపు కషాయం, రాత్రి అల్లం, మిరియం కషాయం ఇస్తే,  వేపాకు చేదుకి పిల్లలు వాంతి చేసుకున్నారు. తాగిన ఆ చుక్క కషాయంకె, వేడి చేసి , చంటి  వాడు కడుపు కదలలా, పెద్ద వాడు ‘నెంబర్ టూ’ కే వెళ్లనని మారాం చేసాడు.వామన రావు రోజు  కషాయం తాగే ముందర ఐదు నిమిషాలు అటు ఇటు తచ్చాడి,తదుపరి మొహం గంభీరంగా పెట్టుకుని, ఒక్క గుటకలో తాగేశాడు. అతని నోట్లో పొక్కులు వచ్చి ముద్ద దిగక  పోయినా,కక్కా లేక మింగాలేక మూగ నోము పట్టాడు.

బయట నుంచి కూరలు, పళ్ళు, సరుకులు ఏమి తెప్పించుకున్న పది సార్లు పీచు పెట్టి తోమాల్సి వస్తోంది.ఏమీ ముట్టుకున్నా రుక్మిణి ఒక చేత్తో డిట్టోల్, ఇంకో  చేత్తో టవల్ తో ప్రత్యక్షమవుతుంది.మాటిమాటికి చేతులు సోప్ తో,శానిటైజర్తో కడిగి కడిగి పుళ్ళు అవుతున్నాయి.పాలవాడిని ప్యాకెట్లు గేట్ కి కట్టిన బుట్టలో వెయ్యమని చెప్పి,వాడు వెళ్లిన గంటకి,నెమ్మదిగా బయటకి వచ్చి, పొలాల్లో పురుగుల మందు కొట్టే వాడి లాగ, ముక్కుకి గుడ్డ కట్టుకుని , పొడవాటి దండెం  కర్ర తో తీసి,లోపలికి తీసుకువెళ్లి పీచుతో పర పరా తోమి అప్పుడు పాలు కాస్తోంది. కూరలు అదే పధ్ధతిలో కడగటం,ఆరపెట్టటం చేస్తోంది. సగం బద్ధకం మిగతా సగం భయంతో రుక్మిణికి చుక్కలు కనపడుతున్నాయి. దేవుడా! ఎందుకీ కరోనా పంపావు అని  వాపోయింది. 

మురికిగా ఉంది అని నేల మొప్పింగ్ చేస్తే,లోషన్ ఎక్కువయ్యి,నేల  రొచ్చు రొచ్చు  అయ్యి,రుక్మిణి జర్రున జారిపడింది. కాలు బెణికింది. 
దబ్బు! మన్న శబ్దానికి ‘ ఏమయ్యింది రుక్కు? అంటూ గాభరాగా వెళ్లిన వామన రావు కూడా జారిపడి నడ్డి విరిగినంత పని అయ్యింది.  పిల్లలు లోపల గదిలో ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా!
వాళ్లిద్దరూ, నొప్పితో ముక్కుతూ మూలుగుతూ నడ్డికి , కాలు బెణుకుకి , వారం పాటు రాసిన అమృతాంజనం  గుబాళింపుకి, పక్కిళ్ల వాళ్ళ జలుబు, ముక్కు దిబ్బడ మటుమాయం అయ్యాయి. 

వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఘొల్లుమంది. ‘అక్క చూడవే, ఎప్పుడన్నా నీ లాగా  కంప్లైంట్ చేసిందా,అన్ని పనులు చేసుకోవట్లా, ఇంత వయసు వచ్చి నేను చేసుకోవట్లా. ఈ కరోనా తగ్గి పొంగానే మళ్ళీ రత్తాలుని పెట్టుకుంటావుగా. అయినా కరోనా మీ ఒక్క ఊళ్ళోనే వచ్చిందా, ప్రపంచం అంతా ఇదే బాధ పడుతున్నారు’ అని తల్లి హితబోధ  చేసింది.

‘అయినా, తప్పంతా నీదే చిన్నప్పటి నుంచి నాకు పనులు ఎందుకు నేర్పలేదు’ అని రుక్మిణి తల్లి మీద తన అక్కసు  అంతా కక్కింది. 

ఆ రాత్రి రుక్మిణి ఒక్క నిమిషం కూడా కునుకు తియ్యలేదు.మంచం మీద ఇంకా దొర్లుతోంది. నెలకి మూడు స్విగ్గిలు, ఆరు ఫుడ్ జాయింట్ల తో నల్లేరు మీద నడక  లాగ సాగి పోయే, తన జీవితం ఇలా అయిందేంటి అని వల వలా ఏడిచింది. క్రిందటి సంవత్సరేమే వాషింగ్ మెషిన్ కొనుక్కున్నారు, లేకపోతే ...... ఆమ్మో!  తాను బట్టలు ఉతుకుతున్న సీన్ ఊహించుకుని  ఉలిక్కిపడింది. 
అప్పుడే ఒక గట్టి నిర్ణయానికి వచ్చి, వామన రావు వైపు తిరిగి, అతని వీపు మీద గోరుతో సుతారంగా  గీకుతూ, గోముగా, ‘ వాము,భర్త అంటే భరించు వాడు కదా. నా ఉద్దేశంలో ఈ సంసార సాగరాన్ని ఈదే శక్తి, సహనం అన్ని మీ మగవాళ్ళకే ఉంటాయి. కానీ, నేను  కష్టం నష్టం  తెలిసిన  దాన్ని కాబట్టి అంతా నీ మీద వదిలెయ్యనులే. ఈ కరోనా తగ్గేంత వరకు అన్ని పనులు సగం సగం చేసుకుందాం.పెద్దాడి పనులు నువ్వు, చిన్నాడి పనులు నేను. కూరలు నువ్వు తరుగు, వంట నేను చేస్తా’ అంటూ వగలబోయింది.
ఇంట్లో వంట తినలేక తాను, పిల్లలు మలమలా మాడిపోతున్నారు. బయట తినే ఛాన్స్ ఎలాగో లేదు. ఇంటి పనిలో తాను ఒక చెయ్యి వేస్తె తనకి అంత కష్టం అనిపించదు. నోట్లోకి నాల్గు వేళ్ళు వెళ్తాయి. పది రోజులు కంటే ఎలాగో చెయ్యలేదు అని  తెలుసు కాబట్టి , ఆ రోజు అంతా నేనే చేస్తాను అని భార్య అంటే, భార్య  మాట వినటమే కానీ ఎప్పుడు ఎదురు చెప్పటం తెలియక వాము అప్పుడు గమ్మున ఉన్నాడు.భార్యాభర్తలు,  ఇప్పుడు రుక్కు రివర్స్ గేర్ లో అనుకున్నట్టే అడుగుతుంటే ....
‘ నీ మాట ఎప్పుడైనా కాదన్నానా’ అని అన్నాడో లేదో......
అయితే పాలు కాచి పిల్లలుకి ఇవ్వు , నువ్వు కాఫీ పెట్టుకో. ఇంటి పని నువ్వు చేస్తావుగా , నేను రాత్రి అంతా పడుకోలేదు, ఇప్పుడు కాసేపు పడుకుంటా’ అని ఆర్డర్స్ జారీ  చేస్తున్న రుక్కు వంక ఒక వెర్రి లుక్కు ఇచ్చి వంటింటి వైపు  నడిచాడు  రుక్కు’స్ వాము . 

--జానకి విశ్వనాథ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com