గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు కోసం ఛలో ఢిల్లీ

గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు కోసం ఛలో ఢిల్లీ

తెలంగాణ:ఆరు గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (మినిమం రిఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి)ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. ఎనిమిది మంది సభ్యుల గల్ఫ్ జెఏసి బృందం శనివారం మంచిర్యాలలో ఢిల్లీ వెళ్లే రైలులో బయలుదేరారు. 

ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం  సర్కులర్లు జారీ చేసి ఆరు నెలలు కావస్తున్నదని,ఈ సర్కులర్లను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని ఎన్నో విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుండి స్పందన లేదని అన్నారు.ఈనెల 8న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్బంగా  తాము అన్ని రాష్ట్రాల ఎంపీలను 8, 9 తేదీలలో కలిసి గల్ఫ్ కార్మికుల వేతన సమస్యను వివరించి వినతిపత్రాలు  అందజేస్తామని  అన్నారు. 

వేతన తగ్గింపు సర్కులర్ల ప్రభావం మెల్లమెల్లగా రాబోయే కాలంలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని గల్ఫ్ జెఏసి రాష్ట్ర నాయకులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. అందరినీ ఒకే గాటన కట్టి నెల జీతం 200 డాలర్లకు (రూ.15 వేలకు) తగ్గిస్తూ ఏకపక్షంగా సర్కులర్లు జారీ చేయడం వలన గల్ఫ్ కార్మికులు మరింత పేదరికంలోకి జారిపోనున్నారని ఆయన అన్నారు. సర్కులర్లను రద్దుచేసి, పాత వేతనాలను కొనసాగించాలని కోరారు.  

ఒమన్,యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కనీస వేతనాలను సవరించాలని భారతదేశాన్ని కోరలేదని, రిక్రూటింగ్ ఏజెన్సీలు, విదేశీ కంపెనీ యాజమాన్యాల ఒత్తిడికి భారత ప్రభత్వం లొంగిపోయినట్లు కనిపిస్తున్నదని  గల్ఫ్ జెఏసి ఖతార్ ప్రతినిధి తోట ధర్మేందర్ అన్నారు. ఖతార్ ప్రభుత్వం అన్ని దేశాల కార్మికులకు 1,000 రియాళ్ళ కనీస వేతనం, భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని చట్టం చేసిందని, భారత ప్రభుత్వం తమ కార్మికులను 728 రియాళ్లకే (200 డాలర్లు) పంపిస్తామని చెప్పడం  ఘోరమని ఆయన అన్నారు. 

గల్ఫ్ జెఏసి బృందంలో మెంగు అనిల్, పంది రంజిత్, పొన్నం రాజశేఖర్, బద్దం వినయ్, దాసరి మల్లిఖార్జున్, గన్నారం ప్రశాంత్, పట్కూరి బసంత్ రెడ్డి ఉన్నారు. 

Back to Top