అప్పులు చెల్లించకపోతే పరువునష్టం-జగన్ సర్కార్ కు కేంద్ర విద్యుత్ సంస్ధల హెచ్చరిక

- November 18, 2021 , by Maagulf
అప్పులు చెల్లించకపోతే పరువునష్టం-జగన్ సర్కార్ కు కేంద్ర విద్యుత్ సంస్ధల హెచ్చరిక

అమరావతి: ఏపీలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పైకి చెప్పుకునేందుకు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా విద్యుత్ సంస్ధల నష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధల వద్ద భారీగా రుణాలు తీసుకుని వాటిని నడిపిస్తోంది. ఈ రుణాలకు అసలు, వడ్డీలు చెల్లించకపోవడం, బకాయిల చెల్లింపు గడువు కూడా ముగిసిపోవడంతో కేంద్ర ఆర్ధిక సంస్ధల ప్రతినిధులు నిన్న అమరావతి వచ్చి హెచ్చరికలు చేసి వెళ్లారు. బకాయిలు చెల్లించకపోతే పరువు నష్టం దావా తప్పదనే హెచ్చరికలు కూడా చేసి వెళ్లినట్లు తెలుస్తోంది.

డిస్కంల బకాయిలు 
ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్ధలు (డిస్కంలు) నష్టాల బాటలో సాగుతున్నాయి. వీటిని నిలబెట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం లాభాల బాటలోకి రావడం లేదు. నష్టాలు తగ్గించుకునేందుకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు అవి పెరుగుతూ పోతున్నాయి. వ్యవస్ధలు కుప్పకూలకుండా ఉండేందుకు భారీ ఎత్తున అప్పులు తెచ్చి వాటిని నడిపించాల్సిన పరిస్ధితి వచ్చేసింది. అయినా అవి పనితీరు మార్చుకోవడం లేదు. దీంతో నష్టాల బాటలో ఉన్న విద్యుత్ సంస్ధలకు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధలు ఇస్తున్న రుణాలతో ఇప్పటివరకూ వాటిని నడిపారు. కానీ ఇప్పుడు వాటిని కూడా తిరిగి చెల్లించకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది.

నిరర్ధక ఆస్తుల జాబితాలో జెన్ కో
ఏపీ విద్యుత్ ఉత్పత్తి కార్పోరేషన్ (జెన్ కో) నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించకపోవడంతో మరింత ఇరుకునపడ్డాయి. రుణాల్ని గడువు దాటిపోయినా చెల్లించకపోవడంతో ఆర్ధిక సంస్ధల కోరిక మేరకు కేంద్రం ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో పెట్టింది. దీంతో ఏపీ పరువు కాస్తా గంగపాలయ్యింది. అయినా ఏపీ నుంచి రుణాల చెల్లింపులేకపోవడంతో చేసేది లేక కేంద్ర అధికారులు తదుపరి చర్యలకు దిగారు. ఇందులో భాగంగా అమరావతికి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు.

రూ.546 కోట్లు చెల్లించకపోతే కఠిన చర్యలు
ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సంస్ధ జెన్ కో, అలాగే పవర్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) కేంద్ర విద్యుత్ ఆర్ధిక సంస్ధల వద్ద తీసుకున్న రూ.546 కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. దీంతో వీరికి అప్పు ఇచ్చిన కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ సీఎండీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఘాటుగా లేఖ రాశారు. ఇందులో తమ వద్ద తీసుకున్న రూ.546 కోట్ల అప్పులు తక్షణం చెల్లించాలని కోరారు. చెల్లించకపోతే తలెత్తే పరిణామాల్ని కూడా సీఎస్ కు రాసిన లేఖలో ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా వివరించారు. విద్యుత్ రంగ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తమ బకాయిలు చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్ధలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.

పరువు నష్టం హెచ్చరికలు
గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే ఏపీ జెన్ కో, ఏపీపీడీసీఎల్ లను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చామని, ఇంకా జాప్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్ఈసీ హెచ్చరించింది. ఇలా అప్పుల ఎగవేత పరువు నష్టం కిందకు వస్తుందని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పరువు నష్టం దావా వేస్తామనే అర్ధం వచ్చేలా ఆర్ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాదు రుణాల ఎగవేతకు పాల్పడినందుకు ఆయా సంస్ధల ఎస్క్రో ఖాతాలు స్తంభింపజేయడంతో పాటు సెక్యూరిటీలపైనా దివాలా చట్టం కింద చర్యలు చేపడతామని హెచ్చరించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మంటగలుస్తుందని ఆర్ఈసీ సీఎండీ లేఖలో తెలిపారు.

జగన్ సర్కార్ కు నోటీసులు?
రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసిన పంపిణీ సంస్ధలు ఇప్పుడు నష్టాల బాటలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొండి బకాయిలు వసూలు చేసుకోలేని పరిస్ధితి ఉంది. తాజాగా ఏపీఈఆర్సీ కూడా ప్రభుత్వ బకాయిలు వసూలుకు నోటీసులు పంపాలని డిస్కంలకు సూచించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ సైతం సబ్సిడీల వసూలుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని తాజా సమీక్షలో రాష్ట్ర ప్రుభుత్వ విద్యుత్ సంస్ధలకు సూచించాయి. దీంతో ఇప్పుడు డిస్కంలు కేంద్ర సంస్ధలు, ఏపీఈఆర్సీ చెప్పినట్లు విని జగన్ సర్కార్ కు నోటీసులు జారీ చేస్తాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com