'బంగారు బతుకమ్మ'

- June 08, 2015 , by Maagulf
'బంగారు బతుకమ్మ'

తెలంగాణ తల్లి ఒడిలొ ఉయ్యాలూగు బతుకమ్మ

పది జిల్లల ప్రజల చేత పూజలొందు గౌరమ్మా              

ఇంటింటికి ఇలవేల్పై మా కంటికి కనురెప్పై

సల్లంగా జూసి మమ్ము సంకటాలు కడ తేర్చి

బతుకులుద్ధరించు తల్లి బంగారు బతుకమ్మ    IIబతుకులుII

 

గునుగుబువ్వు తంగేడు గులాబీలు గన్నేరులు

బంతిపూలు చేమంతులు బొడ్డుమల్లె సంపెంగలు

రకరకాల పూలు తెచ్చి రంగులతో రంగరించి

భక్తితోడ నీ పూజకు బతుకమ్మలు జేస్తుంటే      IIబతుకులుII

 

 

పట్టుచీరగట్టి  తలలొ మల్లెపూల మాల జుట్టి

ముత్తైదువులంత గలిసి మురిపెముగా ముందుకొచ్చి

ముచ్చటైన చప్పట్లతొ   నీ చుట్టూ తిరుగుకుంటు

గొంతులెత్తి తియ్యంగా నీపాటలు పాడుతుంటే    IIబతుకులుII

 

 

తియ్యనీ మలీద లడ్లు కమ్మనైన పులిహోర

పప్పుబెల్లము  పెరుగన్నము పట్టుదలతొ తెచ్చి నీకు  

సద్దుల బతుకమ్మవంటు సద్దులు నైవేద్యమెట్టి  

రోజంతా నీపూజలు  మోజుపడుతు చేస్తుంటే    IIబతుకులుII

 

అందరికీ ఆసరిచ్చు హైద్రాబాదు అన్నయ్యలు

ఆత్మగల్ల పాణమున్న ఆదిలాబాదు అక్కయ్యలు

నిజమైన ప్రేమజూపు నిజాంబాదు తమ్ముళ్ళు

మల్లెపూల మనసులున్న మెదకులోని చెల్లెళ్ళు   

కల్తిలేని మాటలాడు కరీంనగరు కాకయ్యలు

మమకారం మస్తుగున్నమహబూబ్‌నగరుమామలతో

బలగమంత జేరి   నీకుసంబరాలు జేస్తుంటే    IIబతుకులుII

 

ఖమ్మంలో కొలువున్న భద్రాచల రామయ్య

రంగారెడ్డి చెలక లోని చిలుకూరు బాలాజీ

నల్గొండ కొండపైని యాదగిరి నరసింహ సామి

వరంగల్లు జిల్లా లోని వెయ్యి స్తంభాల గుళ్ళ

దేవుళ్ళే దిగి వచ్చి నీ జాతర జరుపుతుంటే    IIబతుకులుII

 

 

ముఖ్యమంత్రి కేసీయారు ఇతర మంత్రులంత గూడి

బతుకమ్మను ప్రజల బతుకు దేవతగా ప్రకటించి

నీ వేడుక రాష్ట్రానికి అధికారిక పండుగంటు

తెలంగాణ సర్కారే  సంబరాలు జరుపుతుంటే   IIబతుకులుII

 

అబుధాబీ షార్జాఃలు దుబాయ్ లున్న తెలుగోళ్ళు

చిన్నపెద్ద  పేదగొప్ప తేడలేమి జూపకుండ

ఆనందముతోడ వచ్చి ఆటపాటలాడుకుంటు

అంగరంగ వైభవంగ   నీపూజలు జేస్తుంటే       IIబతుకులుII

 

 

 

 

                                                           …నక్క భాస్కర రావు(అబుధాబి)

                                                               తేది: 26. 9. 2014

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com