ప్రేమ... పెళ్లి... 18 ఏళ్ల‌కు విడాకులు: విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఐశ్వ‌ర్య, ధ‌నుష్‌!

- January 18, 2022 , by Maagulf
ప్రేమ... పెళ్లి... 18 ఏళ్ల‌కు విడాకులు: విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఐశ్వ‌ర్య, ధ‌నుష్‌!

సినీ పరిశ్రమలో ఈ మధ్య విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఈ జంట వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించడం గమనార్హం. 

2004లో ధనుష్, ఐశ్వర్యల వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధనుష్ ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత కస్తూరి రాజా తనయుడు. అన్న స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్. ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె. కొన్నినెలల క్రితం ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రజనీ కాంత్ పేట్ట సినిమాలోని ‘ఇలమై తిరుంబదే’ పాటను ధనుష్.. ఐశ్వర్య కోసం స్వయంగా పాడడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ధనుష్‌ సోదరికి ఐశ్యర్య మంచి స్నేహితురాలు. దాంతో ధనుష్, ఐశ్వర్యల మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించడంతో నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్‌ హీరోగా థ్రిల్లర్‌ సినిమా ‘3’ని తెరకెక్కించారు. హీరోయిన్‌గా తన బాల్య స్నేహితురాలు శృతి హాసన్‌ను తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే.. ధనుష్, శృతి మధ్య ఏదో ఉందనే ప్రచారం తీవ్రంగా జరిగింది. దాంతో వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైంది. తర్వాత అంతా సర్దుకున్నా... ఇప్పుడేం జరిగిందో గాని ఇక కలిసి బతకలేమనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చి విడిపోతున్నట్లు సోమవారం ప్రకటించారు. 

సినీ ఇండస్ట్రీలో చాలా కాలం కాపురం చేసిన జంటలు ఇలా విడాకులు తీసుకోవడం అన్నది ఎప్పటినుంచో ఉన్నదే. ప్రతాప్ పోతన్ - రాధిక, శరత్ బాబు - రమాప్రభ, నాగార్జున - లక్ష్మి, పవన్ కళ్యాణ్ - రేణుదేశాయ్, కమల్ హాసన్ - వాణీగణపతి, కమల్ హాసన్ - సారిక, సుమంత్ - కీర్తిరెడ్డి, మంచు మనోజ్ - ప్రణతి, సైఫ్ ఆలీఖాన్ - అమృతాసింగ్, ధర్మేంద్ర - ప్రకాశ్ కౌర్, సరిత - ముఖేష్, బోనీకపూర్ -మోనా, ఆమిర్ ఖాన్ - కిరణ్ రావు, హృతిక్ రోషన్ - సుసన్నే ఖాన్ విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ధనుష్ - ఐశ్వర్య కూడా వచ్చి చేరడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com