మాతృభాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: ఉపరాష్ట్రపతి
- February 22, 2022
చెన్నై: ప్రజలను ఒకేతాటిపైకి తీసుకొచ్చే విషయంలో భాష పోషించే పాత్ర అత్యంత కీలకమని, అంతటి విలువైన మాతృభాషలను పరిరక్షించుకునేందుకు ప్రజాఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ‘మన మాతృభాషను మనం కోల్పోతే.. మన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే’ అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అంతర్జాల వేదిక ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో చెన్నై నుంచి ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత పురోగతి సాధిస్తున్నప్పటికీ.. తర్వాతి తరాలకు మాతృభాష మాధుర్యాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆటలు, పాటల ద్వారా చిన్నారులు తమ మాతృభాషను నేర్చుకునేలా ప్రోత్సహించాలి. అంతే కాదు భారతీయ భాషల్లో సాంకేతిక పదాలను వినియోగించడం ద్వారా వారిలో సాంకేతిక విద్యకు సంబంధించిన ఆసక్తిని పెంపొందించవచ్చు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
భారతీయ భాషలు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేందుకు వారథులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. మన గతం, వర్తమానాన్ని అనుసంధానం చేయడంలో భాషలు పోషించే పాత్ర అత్యంత కీలకమన్నారు. మన పూర్వీకులు వారి వేల సంవత్సరాల అనుభవాలను రంగరించి అందించిన జ్ఞానభాండాగారాన్ని తెలుసుకోవడం భాషను నేర్చుకోవడం వల్లే సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారతదేశంలో వివిధ భారతీయ భాషలు వేల ఏళ్లుగా విరాజిల్లుతున్నాయని.. అలాంటి భాషలను ప్రాంతీయ భాషలని పిలవడం కంటే భారతీయ భాషలుగా గుర్తింపు నివ్వడం ఆయా భాషలను గౌరవించుకున్నట్లని ఆయన పేర్కొన్నారు. మన మాతృభాష ఎంత ముఖ్యమో... ప్రతి భాష అంతే ముఖ్యమనే విషయాన్ని మరవొద్దన్నారాయన. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని మన భాషలే ప్రతిబింబిస్తున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
భారతదేశం వందల భాషలు వేల మాండలికాలకు పుట్టినిల్లు అని, భారతీయుల సృజనాత్మకమైన భావవ్యక్తీకరణకు భాషామాధుర్యమే కారణమని ఆయన అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) - 2020లో మాతృభాషలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా భారతీయ విద్యావిధానం మరింత పరిపూర్ణంగా, విలువల ఆధారిత సమగ్రమైన వ్యవస్థగా నిలబడుతుందనే ఆశాభావాన్ని ఉపరాష్ట్రపతి వ్యక్తం చేశారు. భారతీయ యువతలో అంతర్లీనంగా ఉన్న శక్తిసామర్థ్యాలను ఈ విధానం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుందని అందుకోసం ఈ విధానాన్ని అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. మన దైనందిన జీవితంలోని ప్రతి రంగంలో మాతృభాష వినియోగం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పరిపాలనలో మాతృభాష వినియోగం పెరగాలని విద్యాబోధన కూడా మాతృభాషలో జరగాలని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలన్నారు.
వలసపాలన కారణంగా భారతీయ భాషలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, స్వాతంత్ర్యానంతరం కూడా వీటిని కాపాడుకునే దిశగా సరైన చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ దిశగా జరిగిన నష్టం నుంచి బయటపడి మాతృభాషలను కాపాడుకుంటూ తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక విద్యను కూడా వివిధ భారతీయ భాషల్లో అందించడం ద్వారా విద్యార్థుల్లో మరింత ఆసక్తిని పెంపొందించవచ్చన్నారాయన.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మహాత్మాగాంధీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ గిరీశ్వర్ మిశ్రా, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, శాఖ సంయుక్త కార్యదర్శి ఇందిరామూర్తి, ఉన్నతాధికారులు, సైంటిస్టులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!