ఖతార్ లోని ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా 'ఉగాది' వేడుకలు

- April 03, 2022 , by Maagulf
ఖతార్ లోని ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా \'ఉగాది\' వేడుకలు
దోహా: ఆంధ్ర కళా వేదిక-ఖతార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "ఉగాది" సందర్భంగా "పండగ చేస్కో" కార్యక్రమాన్ని ఐడీఎల్ ఇండియన్ స్కూల్ లో 31st Mar 2022 న  ఘనంగా నిర్వహించారు.
 
మన తెలుగింటి అమ్మాయి మరియు మూడు సార్లు నంది అవార్డు గ్రహీత, సినీ నేపధ్య గాయని శ్రీమతి ఉష తన పాటలతో, మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించారు.శ్రీమతి ఉష  మాట్లాడుతూ.. కార్యక్రమం సొంత ఇంట్లో పెళ్లి సందడిలా ఉందని ఆత్మీయులతో కలిసి పండగ చేసుకున్నట్లు ఉందని తెలిపారు.    
 
శ్రీమతి పద్మ కర్రీ మొదటి కార్యదర్శి(రాజకీయ & సమాచారం) భారత రాయబార కార్యాలయం ఖతార్ నుండి వేడుకలలో పాల్గొన్నారు.  ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు.  అలాగే తనకు గాయని ఉష గారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు శ్రీమతి ఉష గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ బృందం సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు. 
 
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఎన్నో అవాంతరాలను అధిగమించి కేవలం వారం రోజుల వ్యవధిలో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.  కార్యక్రమానికి సుమారు 700 కి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని వీక్షించడమే కాక చివరలో కుటుంబసభ్యులందరితో కలిసి ఉష గారితో ఫోటో దిగేందుకు బారులు తీరారని, వేదిక ప్రాంగణ పరిమితికి మించి జనులు రావడంతో కొందరు వెనుదిరిగి రావాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాము అని తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ప్రత్యేకించి శుభోదయం సంస్థల అధినేత లయన్ డా.లక్ష్మి ప్రసాద్ కలపటపు గారికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  అలాగే స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. 
కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు (చిన్నారుల మరియు పెద్దల నృత్యాలు మరియు  లఘు నాటిక) ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.  ఈ కార్యక్రమానికి శ్రీమతి శిరీషా రామ్ మరియు శ్రీమతి సుధ వ్యాఖ్యాతలుగా, విక్రమ్ సుఖవాసి సాంకేతిక నిపుణుడిగా వ్యవహరించగా,  రవీంద్ర ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com