ఇరాన్: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో తుపాకుల మోత

- October 13, 2022 , by Maagulf
ఇరాన్: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో తుపాకుల మోత

టెహ్రాన్: హిజాబ్‭కు వ్యతిరేకంగా ఇరాన్‭లో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడా ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, కొన్ని ప్రాంతాల్లో కాల్పులు జరపడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పదుల సంఖ్యలో ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కాగా తాజాగా ఒకే రోజు అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనల్లో కాల్పులు జరిగాయి. ఇరాన్ భద్రతా దళాలే ఈ కాల్పులు జరిపినట్లు కొన్ని వీడియోలు షేర్ చేస్తూ నార్వే ఆధారిత మానవ హక్కుల సంఘం పేర్కొంది.

ఈ వీడియాల్లో ‘డెత్ ఆఫ్ డెమొక్రసీ’ అంటూ కొందరు అరుస్తుండడం రికార్డైంది. 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమీని మరణంతో మొదలైన ఈ నిరసనలు నెలకు దగ్గరికి వస్తున్నా ఇరాన్‭ను మాత్రం అట్టుడికిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ కఠిన నిబంధనలను చట్టాలను ధిక్కరిస్తూ ఇరాన్‭లోని మహిళలు హాజాబ్‭ను కాల్చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి హిజాబ్ తొలగించి దానికి నిప్పు పెడుతున్నారు. దమ్ముంటే ఏం చేస్తారో అదే చేసుకోండంటూ అక్కడి పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇంతటితో ఆగకుండా.. హిజాబ్ కాల్చేస్తూ, జుట్టు కత్తించుకుంటూ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వేలాది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మహిళలపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, తుపాకులు పేల్చుతూ చెల్లచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా నెటిజెన్లు మహిళల నిరసనపై ప్రశంసలు కురిపిస్తూనే ఇరాన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఉండే మత నిబంధనలు, ఆచారాలు అక్కర్లేదని తేల్చి చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com