సౌదీలో బయటపడ్డ 80 మిలియన్ల నాటి అరుదైన శిలాజ అవశేషాలు

- October 14, 2022 , by Maagulf
సౌదీలో బయటపడ్డ 80 మిలియన్ల నాటి అరుదైన శిలాజ అవశేషాలు

సౌదీ: 80 మిలియన్ సంవత్సరాల నాటి అరుదైన శిలాజ అవశేషాలు బయటపడ్డట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో దుబా, ఉమ్లుజ్ గవర్నరేట్ల మధ్య ఎర్ర సముద్ర తీరం వెంబడి తబుక్ ప్రాంతంలో ఈ శిలాజాలను కనుగొన్నట్లు పేర్కొంది. ఈ ఆవిష్కరణలు రాజ్యంలో శిలాజ ప్రదేశాల ఉనికిని సూచిస్తున్నాయని SGS తెలిపింది. భవిష్యత్తులో ఎర్ర సముద్రం ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతాయని తెలిపింది. ఎర్ర సముద్రం, అమలా ప్రాజెక్ట్ ప్రాంతాలలో వివిధ రకాల సకశేరుకాలు, అకశేరుకాల శిలాజాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా నిస్సార, తీర సముద్ర పరిసరాలలో నివసించిన మొక్కల అవశేషాలు ఉన్నాయని, వాటి వయస్సు మధ్య (మెసోజోయిక్), ఆధునిక (నియోజీన్) భౌగోళిక జీవితాల(క్రెటేషియస్, మియోసిన్) నాటివన్నారు. ఈ శిలాజాలలో కొన్ని సముద్రపు సరీసృపాలకు చెందినవని SGS తెలిపింది. 45 మిలియన్ సంవత్సరాల నాటి ఈయోసిన్ అవక్షేపాల నుండి శిలాజ నమూనాలు కూడా తీసుకున్నట్లు SGS చెప్పింది. ఉత్తర సౌదీ అరేబియాలో ఉన్న అల్-జౌఫ్ ప్రాంతంలోని అల్-రషరాషియా నిర్మాణంలో శిలాజాల కోసం అన్వేషణాత్మక పరిశోధనా బృందం పరిశోధనలు చేస్తున్న క్రమంలోనే టెథిస్ సముద్రంలో అరుదైన 'జెయింట్ ఈయోసిన్ వేల్'ను గుర్తించినట్లు ఎస్జీఎస్ వెల్లడించింది.  దీని పొడవు దాని తల నుండి తోక చివరి వరకు 18 నుండి 20 మీటర్ల వరకు ఉంటుందన్నారు. ఈ రకమైన తిమింగలం "బాసిలోసారస్" కావచ్చని, ఇది సముద్ర క్షీరదంగా పరిగణించబడుతుందని, ఈయోసిన్ తిమింగలాలలో అతిపెద్దదని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com