కొవ్వొత్తిలా

- June 16, 2015 , by Maagulf
కొవ్వొత్తిలా

మనిషి అనుకుంటాడు

నేను నడిస్తే

నా వెనుక

లోకం నడుస్తుందా అని

 

మనిషి అనుకుంటాడు

నేను చెపితే

లోకం..ఇంత పెద్ద లోకం

వినిపించుకుంటుందా అని

 

నా మనసే

నా మాట ఒక్కోసారి వినదు

ఇక ఇతరులెందుకు

వింటారు అని

 

ఒక్క అడుగు

మరెన్నో అడుగులకు

నాంది అవుతుందని

తెలిసి కూడా

అడుగు వెయ్యడు

అడుగు వేస్తే

తానేమైపోతానోనని

మనిషి భయం

లోకం తనను

గెలిచేస్తుందేమోనని భయం

 

కొవ్వొత్తి

ఆకారం ఎంత?

దాని నిడివి ఎంత?

తనను తాను

దహించుకుంటే తప్ప

నిలబడలేదు కదా!

దహించుకోవటంలో

తాను కరిగిపోతానని

తనకు తెలుసు కదా!

 

చుట్టూ చిమ్మచీకట్లు...

ఒక్క అగ్గిపుల్ల

అందించిన

రవ్వంత నిప్పును

వొత్తి ద్వారా అందుకుంటుంది

 

విశాలంగా వ్యాపించి ఉన్న

చీకట్ల ముందు

నిజానికి తానెంత?

అయినా ఏదో నమ్మకం

గుండె నిండా త్యాగం

బొట్టు బొట్టుగా

కరుగుతూ జారుతూ

చివరకు

కనుమరుగవుతుంది

 

కానీ ఆ కొద్ది క్షణాలు

కొవ్వొత్తి ప్రపంచానికి

నేత్రమై భాసించింది

ఆశగా చిగురించింది

జాగరూకత వహించమని

సందేశం ఇచ్చింది

 

మనిషి మాత్రం

తొలి అడుగు వేసేందుకు

భయపడతాడు

త్యాగానికి సిద్దపడడు

 

కాకిలా కలకాలం జీవించేకన్నా

హంసలా క్షణ కాలం

బ్రతకటం మిన్న

ఈ సత్యాన్ని

తెలుసుకోడు

తానొక చిరుదీపమై

వెలిగినా

తనతోటి వారికి

వెలుగునిస్తానని

గ్రహించడు

 

అది తెలిసిన వాడు

ఆలస్యం అసలు చేయడు

జీవితాన్ని

వృధా చేసుకోడు

ఆఖరి శ్వాసను కూడా

తృప్తిగా విడుస్తాడు

 

                            -- డా||మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com