5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
- December 23, 2022
విజయవాడ: భాష, శ్వాస మనిషి జీవితానికి అత్యంత కీలకమైనవని... ఈ రెండింటిలో ఏది ఆగిపోయినా జీవితం ముందుకు సాగదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, భాషా పరిరక్షణే ధ్యేయంగా సభలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. రచనల ద్వారానే భాషా సంస్కృతులు ముందు తరాలకు ప్రవహిస్తాయని, రచనలు లేని తరాల ఆలోచనలు ముందుకు సాగవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రా వారి 'కోటి మాటల కోట' తెలుగు పదాల ప్రావీణ్య దీపికను ఆవిష్కరించారు. ఈ దీపికను రూపొందించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రసార మాధ్యమాలేవీ లేని సమయంలో ఘంటం ద్వారా తాళపత్రాల మీద రాస్తూ ప్రతులను తయారు చేసే నాటి కవులు నిబద్ధత ఉన్నతమైనదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఈతరం రచయితల్లో అదే స్ఫూర్తి కనిపించాలని ఆకాంక్షించారు. భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావలసిన అవసరం ఉందన్న ఆయన, మన దేశ వైభవాన్ని సాహిత్యమే ప్రతిబింబించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పటిష్టమైన భాషా సంపద, పుష్కలమైన సాహిత్య సంపద ఉన్న తెలుగు ప్రాచీనతను సగర్వంగా చాటుకోవటమే గాక, నవీన పంథాల తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి జరగాల్సి ఉందని ఆకాంక్షించారు.
తెలుగు భాష పరిరక్షణకు రచయితల చొరవ అత్యంత ఆవశ్యకమన్న వెంకయ్యనాయుడు, భాషను కాపాడుకుంటే అందులోని సాహిత్యం ద్వారా సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయగమన్నారు. నూతన సాహిత్య సృష్టితో పాటు, పూర్వ సాహిత్య పరిరక్షణ కూడా రచయితల బాధ్యత అన్న ఆయన, పుస్తక పఠనాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భాష కోసం ప్రభుత్వాలు విధానాలను రూపొందించగలవు, నిధులను ఇవ్వగలవు అన్న ఆయన, ప్రజల్లో నిబద్ధత లేకుండా భాషా పరిరక్షణ, సాహిత్యాభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.
భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందన్న వెంకయ్యనాయుడు, ఈ ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించటం, పరిపాలనా భాషగా అమ్మభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థానాల కార్యకలాపాల్లో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వటం, ఉన్నత-సాంకేతిక విద్యను అమ్మభాషలో అందించటం, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో మాతృభాషలో మాట్లాడేలా ఐదురకాల చర్యలు అవసరం అని సూచించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పులేదని, కానీ అమ్మభాషలో నైపుణ్యం సాధించటం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.

సమాజంలో వస్తున్న మార్పులు సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, అమ్మభాష అన్నం పెట్టదేమో అనే తల్లిదండ్రుల భయంలో అర్థం లేదని, దీని కారణంగా విలువలు పడిపోతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో తెలుగు రచయితలు మహాసభలను నిర్వహించటం అభినందనీయమన్న ఆయన, సృజనాత్మకతకు, సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసే విధంగా నూతన పంథాల రచనలు రావలసిన అవసరం ఉందని సూచించారు. సమాజ హితమే సాహిత్యం లక్షణం కావాలన్న ఆయన, కవులు, రచయితలు, మేధావులు, విలేకరులు సైతం రాసే ముందు సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా రచనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో పేరుకుపోయిన జాఢ్యాలకు వ్యతిరేకంగా రచయితల కలం కదం తొక్కాల్సిన అవసరం ఉందన్న ఆయన, అవినీతి, అరాచకం, వివక్షలకు వ్యతిరేకంగా రచనలు చేసేందుకు రచయితలు ఉద్యుక్తులు కావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆకులందున అణగిమణగీ.... కవిత కోవిల పలకవలెనోయ్
పలుకులను విని దేశమందు... అభిమానములు మొలకెత్తవలెనోయ్
అన్న గురజాడ దేశభక్తి కవితా పంక్తులను గుర్తు చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇదే స్ఫూర్తి సాహిత్యంలో ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. పిల్లలకు తెలుగు భాష, సంస్కృతులను అలవాటు చేసేందుకు నూతన మార్గాల అన్వేషణ సాగాలన్న ఆయన, ఇందుకోసం రచయితలైన ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అమ్మ తర్వాత మాతృభాషను పిల్లలకు చేరువచేయగలిగింది ఉపాధ్యాయులే అన్న ఆయన, పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించే విధంగా ఆటపాటలతో అమ్మభాషను చేరువ చేసేందుకు నూతన మార్గాలను అన్వేషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు చెందిన రచయితలు, భాషాభిమానులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్







