ఆంధ్ర కళా వేదిక వారి ఆధ్వర్యంలో ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

- February 15, 2023 , by Maagulf
ఆంధ్ర కళా వేదిక వారి ఆధ్వర్యంలో ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

దోహా: క్రీడల ద్వారా అందరిలో ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఖతార్ ప్రభుత్వం తీసుకున్న చొరవలో భాగంగా గత 12 సంవత్సరాలు నుండి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ మంగళవారం నాడు “జాతీయ క్రీడా దినోత్సవం” జరుపుతున్నారు.ఈ సంవత్సరం "ది ఛాయిస్ ఇస్ యువర్స్" అనే ట్యాగ్ లైన్ తో ఈ క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు.

“ఆంధ్ర కళా వేదిక” 14-ఫిబ్రవరి-2023 (మంగళవారం) చిల్డ్రన్స్ పార్క్, అల్ వక్ర
లో “జాతీయ క్రీడా దినోత్సవం” సందర్భంగా "తెలుగింటి ఆటలు - తెలివైన ఆటలు" అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. మనం మరచిపోయిన మన చిన్ననాటి తెలుగింటి ఆటలని ప్రోత్సహించాలని నిర్ణయించి ఆ ఆటలను ( కబడ్డీ, ఖో ఖో , సంచులాట,రుమాలు ఆట, తొక్కుడు బిళ్ళ , చక్రం ఆట ) ఆడించారు.

ఈ కార్యక్రమంలో ఐసిసి జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ
కౌన్సిల్ చైర్మన్ కె.ఎస్ ప్రసాద్, వంటి పలువురు ప్రముఖులతో పాటుగా ఇతర
ప్రముఖ తెలుగు సంఘాల నాయకులు  నందిని,శ్రీధర్,హరీష్ రెడ్డి
మరియు కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని మరింత
ఉత్సాహవంతంగా మలిచారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక
యొక్క కార్యనిర్వాహక వర్గాన్ని వారితో పాటు పాల్గొన్న వారందరినీ అభినందించారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అపూర్వమైన స్పందన లభించిందని,అందరిలో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు. యువతలో మరియు పెద్దలలో క్రీడా స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే మన స్వంత సాంప్రదాయ ఆటలతో ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆయన పేర్కొన్నారు.ఈ
కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన దాతలకు(స్పాన్సర్స్) కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, KT రావు, శ్రీ సుధ, శిరీష రామ్, సోమరాజు, సాయి రమేష్, రవీంద్ర బృందం చేసిన కృషి  అభినందనీయమని తెలిపారు. అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేకించి గోవర్ధన్, సురేష్ బాబు, నీరజ, హరిహరన్, దినశేఖర్ మరియు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచినవారికి మరియు
పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు మరియు బహుమతులు ప్రకటించారు. హాజరైన
వారందరికీ బహుమతులు అందజేశారు మరియు ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన
ఫలహారాలు (మొలకలు), పండ్లు & పళ్ళ రసములు అందజేశారు.ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం
ముగిసింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com