మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..

- March 18, 2023 , by Maagulf
మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..

న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కోవిడ్ కారణంగా ఝార్ఖండ్‌లో ఒకరు, మహారాష్ట్రలో మరొకరు, కేరళలో ఇద్దరు మరణించారు. నెల రోజుల్లో కేసుల సగటు సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. గత ఫిబ్రవరి 18న 112 కేసులు నమోదైతే, నెల తర్వాత 626కు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01గా ఉంది. రికవరీ రేటు 98.80గా ఉంది. శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయానికి అధికారిక లెక్కల ప్రకారం.. కోవిడ్ సోకిన వారి సంఖ్య 4.46 కోట్లు (4,46,94,349)గా ఉంది.

కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161. మరణాల శాతం 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు 220.64 శాతం కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ ఆరు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com