అస్సాం రాజకీయ దిగ్గజం-మహంత
- November 23, 2024
ప్రఫుల్లా కుమార మహంత... అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన రాజకీయ యోధుడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వివక్షకు గురవుతున్న ఈశాన్య రాష్ట్రాల తరపున జాతీయ స్థాయిలో గళం విప్పిన తోలి నాయకుడు మహంత. బంగ్లాదేశీ ముస్లిం వలసలు, ఉల్ఫా తీవ్రవాదుల వల్ల శాంతిభద్రతల సమస్యలతో సతమతం అవుతున్న అస్సాంను గాడిలో పెట్టేందుకు మహంత తీసుకున్న చర్యలకు ప్రశంసలు లభించాయి. కాంగ్రెసేతర కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో సైతం కీలక పాత్ర పోషించారు. నేడు అస్సాం రాజకీయ దిగ్గజం ప్రఫుల్లా కుమార మహంత జన్మదినం.
జాతీయ రాజకీయాల్లో పీకే మహంతగా సుపరిచితులైన ప్రఫుల్లా కుమార మహంత 1952,నవంబర్ 23న అస్సాం రాష్ట్రంలోని నాగోవాన్ జిల్లాలో వులోని గ్రామంలో జన్మించారు. గౌహుతి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నాగోవాన్ ప్రభుత్వ కళాశాల నుంచి బీఎస్సి, న్యాయశాస్త్రంలో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే అస్సాం రాష్ట్రంలో బెంగాలీ ముస్లిం, హిందూ ప్రజల వలసల కారణంగా స్థానిక అస్సాం సంస్కృతిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బెంగాలీ జనాభా వల్ల అస్సామీ భాషకు సైతం ముప్పు వాటిల్లడంతో మొదలైంది. దేశ విభజన సమయంలో బెంగాలీ ముస్లింల వల్లే అస్సాంలోని స్లిహాట్ ప్రాంతాన్ని కోల్పయింది. స్వాతంత్య్రం తర్వాత కూడా బెంగాలీ వలసలు అధికం కావడంతో పాటుగా విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో బెంగాలీల ప్రాబల్యం పెరగడం, స్థానిక అస్సాం ప్రజలకు ఇబ్బందిగా పరిణమించింది. అస్సామీ భాషతో పాటుగా బెంగాలీ భాషకు అధికార హోదాను ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు 60వ దశకంలోనే నిరసనలు చేయడం మొదలుపెట్టారు.
అస్సాం సంస్కృతిని మాయం చేస్తున్న బెంగాలీ ప్రజలను రాష్ట్రం నుంచి తరిమేయాలని నిరసనలు అస్సాం రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. దీంతో పాటుగా1971 ఇండియా - పాకిస్తాన్ యుద్ధ సమయంలో లక్షలాది మంది బెంగాలీ ముస్లింలు తూర్పు పాకిస్తాన్ (నేడు బాంగ్లాదేశ్) నుండి అస్సాంకు వలసలు కట్టంతో పాటుగా, యుద్ధం తర్వాత కూడా వారిక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొని స్థానిక అస్సామీ ప్రజల మీద దాడులు చేయడాన్ని సహించలేని అస్సామీ యువత, విద్యార్థులు వారి ఏరివేతే లక్ష్యంగా బెంగాలీ ముస్లిమ్స్ ను ఊచకోత కోయడం మొదలు పెట్టారు. ఈ ఊచకోతకు స్థానిక అస్సామీ ప్రజలు మద్దతుగా నిలవడంతో రాష్ట్రవ్యాప్తంగా అట్టుడికిపోయింది.
అస్సాంలో జరుగుతున్న పరిణామాలు పట్ల ఇందిరా సర్కార్ సీరియస్ కావడంతో, ఏరివేత ఉద్యమంలో పాల్గొన్న అఖిల అస్సాం విద్యార్ధి సంఘాలతో చర్చలు జరిపి, బంగ్లాదేశీ ముస్లిమ్స్ ను తిరిగి బాంగ్లాదేశ్ పంపిస్తామని సర్దుబాటు చేసుకున్నప్పటికి, దాన్ని బుట్టదాఖలు చేయడంతో మహంత నాయకత్వంలో అఖిల అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మరోసారి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపివ్వడంతో, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కల్పించుకొని విద్యార్ధి నేతలతో చర్చలు జరిపి, వారి డిమాండ్లకు అనుకూలంగా అస్సాం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా అస్సాం రాష్ట్రానికి అక్రమంగా వలస వచ్చిన బెంగాలీ ముస్లింలను గుర్తించి, వారి స్వదేశానికి డిపార్ట్ చేయడం ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందం జరగడంలో కీలకమైన పాత్ర పోషించిన విద్యార్ధి నేతగా ఉన్న మహంతకు మంచి గుర్తింపు వచ్చింది.
1985 అసెంబ్లీ ఎన్నికల నాటికి అస్సాం విద్యార్ధి సంఘం నాయకులు కలిసి మహంత నాయకత్వంలో అస్సాం గణపరిషత్ పార్టీని స్థాపించారు. ఎన్నికల నాటికీ గౌహుతి యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహంత, యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ పార్టీని
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో నేరుగా యూనివర్సిటీ హాస్టల్ నుంచే అస్సాం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. భారత దేశ రాజకీయ చరిత్రలో విద్యార్ధి నేత నుంచి నేరుగా సీఎం అయిన తోలి వ్యక్తిగా మహంత నిలిచిపోయారు.
34 ఏళ్ళ వయస్సులో అస్సాం సీఎంగా మహంత తనపై ఉన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతలతో పాటుగా, సరిహద్దు ఈశాన్య రాష్ట్రాలతో అస్సాంకు ఉన్న వివాదాలను పరిష్కారించడంలో చొరవ చూపారు. ఉల్ఫా తీవ్రవాద సంస్థతో శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రేషన్ వ్యవస్థ పటిష్ఠతకు కృషి చేశారు. మునుపెన్నడూ అధికార పదవులు నిర్వహించక పోవడంతో పాలనాపరంగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోని విమర్శల పాలయ్యారు. రాజకీయ దిగ్గజం హితేశ్వర్ సైకియా దాటికి తట్టుకోలేక రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. వీటితో పార్టీ అంతర్గత వివాదాలతో 1991 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
1991-96 మధ్యలో అస్సాం ప్రధాన ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఉద్యమించారు. సీఎం హితేశ్వర్ సైకియా రాష్ట్రంలో తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ రైనో కారణంగా పోలీసుల చేతుల్లో అమాయక ప్రజలు బలవుతున్నారని లెక్కలతో సహా అసెంబ్లీలో నిరూపించారు. 1996 ఎన్నికల్లో తన పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన మహంత రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1996-01 వరకు సీఎంగా అస్సాం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన చేశారు. అయితే, తన క్యాబినెట్ మంత్రుల అవినీతిని కట్టింది చేయలేకపోవడం, ఉల్ఫా తీవ్రవాదుల పేరిట ఫేక్ ఎన్కౌంటర్స్ , పార్టీలో అసమ్మతి వంటి పలు కారణాలతో సతమతం అయ్యారు. 1985,1991,1996,2001,2006,2011,2016లలో మొత్తం 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
జాతీయ రాజకీయాల్లో సైతం మహంత కీలకమైన పాత్ర పోషించారు. సీఎంగా ఉన్న సమయంలోనే జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించిన మహంత 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్, దేవీలాల్, చంద్రశేఖర్ వంటి ఉద్దండ రాజకీయ నేతలతో సమానంగా గౌరవ మర్యాదలను రాజధాని ఢిల్లీలో పొందారు. ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న తన సన్నిహితుడైన దినేష్ గోస్వామి ద్వారా, ఈశన్య రాష్ట్రాల అభివృద్ధికి సరిపడా నిధుల విడుదలకు పాటుపడ్డారు మహంత. 1996లో సైతం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో సైతం అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పనిచేశారు. దేవెగౌడ, గుజ్రాల్ మంత్రివర్గాల్లో సైతం చేరారు. ఈశన్య రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లో వెలిగిన ఏకైక నేతగా మహంత చరిత్రలో నిలిచారు.
నాలుగు దశాబ్దాల పాటు అస్సాం రాజకీయాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా, ప్రజల అభిమానాన్ని చూరగొంటూ వచ్చిన మహంత, ఎంతో యువతను రాజకీయాల్లో ప్రోత్సహించారు. ఇప్పటి అస్సాం సీఎం హిమాంత బిస్వాస్ సర్మ, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ లు సైతం మహంత వద్ద రాజకీయ ఓనమాలు దిద్దారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతోనే క్రియాశీలక ఎన్నికల పోటీ నుంచి వైదొలిగారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







