ఆదర్శ ప్రజానాయకుడు - కాకాని
- December 24, 2024
ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన బ్రిటన్‌లో ‘‘ఓ నాయకుడు మరణించిన 30 సంవత్సరాల తరువాత కూడా గుర్తిస్తే అతడే నాయకుడు’’ అనే ఓ నానుడి ఉంది. అలాంటి నాయకుడు కాకాని. కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, అతి కొద్ది చదువుతోనే రాష్ట్ర రాజకీయ రంగంలో రాణించిన విశిష్ట గుణసంపన్నుడు కాకాని వెంకటరత్నం. సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా భావించి అందుకు త్రికరణశుద్ధిగా శ్రమించిన నిస్వార్ధ ప్రజానాయకుడు కాకాని వెంకటరత్నం గారి వర్థంతి
కాకాని వెంకటరత్నం ఇప్పటికి ఐదు దశాబ్దాల క్రితం కీర్తిశేషులయ్యారు. అయినా అవిభక్త కృష్ణాజిల్లాలోని గ్రామాలు ఆయనను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి. చాలా మందికి ఆయన స్మృతి ఒక నిరంతర స్ఫూర్తిగా ఉంది. వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారితో సహా ఎంతో మంది విద్యా వంతులు తమ విద్యాభ్యాసానికి ఆయన అందించిన విశేష తోడ్పాటును కృతజ్ఞతలతో ఇప్పటికి స్మరించుకుంటున్నారు. పాల విప్లవాన్ని సాధించి, తమ జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు కాకాని నిర్వహించిన కృషిని పలువురు గృహిణులు, చిన్న రైతులు నిరంతరం గుర్తు చేసుకుంటున్నారు. 50 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు కాకానిని చిత్తశుద్ధి, దక్షత గల నాయకుడుగా ప్రజలు మరింత ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు.
రాజకీయాల్లో కాకాని నిండా మూడు దశాబ్దాలు (1945–72) కూడా క్రియాశీలంగా లేరు. పాఠశాల విద్యను మధ్యలోనే వదిలివేసిన కాకాని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. నికార్సయిన రైతు బిడ్డే కాని భూ ఖామందు కాదు. పూర్తిగా తన సొంత సామర్థ్యంపై ఆధారపడి రాజకీయ శిఖరాలను అధిరోహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించక ముందే రాష్ట్ర స్థాయిలో ప్రముఖ కాంగ్రెస్ నేతగా ఆయన వెలుగొందారు. ఆయన ఒకటి కంటే ఎక్కువసార్లు శాసన సభ్యుడుగా ఎంపికయ్యారు. అలాగే మంత్రి పదవినీ అనేకమార్లు నిర్వహించారు.
రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జమీందారి, భూస్వామ్య కుటుంబాలు వ్యతిరేకించినా, సామాన్య–మధ్యతరగతి ప్రజలకు సేవ చేసి వారి మద్దతుతోనే నాయకుడు ఎదిగారాయన. జయాపజయాల్ని సమానంగా స్వీకరించి, ప్రజలతో నిరంతరం మమేకమయ్యేవారు. 1967లో జరిగిన సాధారణ ఎన్నికలలో జమీందార్లు, భూస్వామ్య కుటుంబాలు ఏకమై కాకానిని ఓడిస్తే, అదే సంవత్సరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆయన్ని ఎంపిక చేశారు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. కాకాని ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 72వ అఖిలభారత కాంగ్రెస్ మహాసభలు విజయవంతంగా జరిగాయి. దీంతో వారి శక్తిసామర్ధ్యాలు రాష్ట్ర, జాతీయ నాయకులను ఆకర్షించాయి.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన నాయకుడు కాకాని. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. సంపన్నులు, భూ స్వాములు, జమిందారులు, ఇతర స్వార్థ పరశక్తులు ఆయన కృషిని, పోరాటాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు ఎన్నో అవరోధాలు కల్పించారు. అయితే కాకాని చలించలేదు. ఎవరికీ లొంగలేదు. మరింత దృఢ సంకల్పంతో పోరాడారు. ప్రజలకు మేళ్లు సమకూర్చారు. ఈ కారణంగానే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో "ఉక్కు కాకాని"గా సుప్రసిద్ధుడయ్యారు. మరి ఏడు సంవత్సరాల క్రితం అమరావతిని గురించిన ఒక పాటలో ఉక్కు కాకాని ప్రస్తావన ఉండడంలో ఆశ్చర్యమేముంది? ప్రస్తుత సమస్యల పరిష్కారానికి కాకాని లాంటి నాయకుడు అవసరమని ప్రజలు సహజంగానే భావిస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎట్లా మొదలవుతుంది, ఎట్లా దినదినాభివృద్ధి చెందాలొ తెలియజేసిన నాయకుడు కనుకనే కాకాని స్మృతి పచ్చగా ఉన్నది. 75 సంవత్సరాల క్రితం ఆయన చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలకు స్ఫూర్తి ఆ సునిశ్చిత భావనే అని చాలా మందికి తెలియదు. స్వీయ విద్యాభ్యాసం ప్రాథమిక పాఠశాల వరకే పరిమితమైనా గ్రామాల అభివృద్ధికి పునాది వేసిన దార్శనికుడుగా కాకానిని కీర్తించడం అతిశయోక్తి కాదు. స్థానిక ప్రజల పాత్ర, పర్యవేక్షణ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అనేది ఆయన సిద్ధాంతం. పార్టీలకు అతీతంగా సహకరించుకోగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు.
విద్య విషయంలోనే కాక అనేక రంగాల్లో అవిభక్త కృష్ణా జిల్లా ఈనాడు ముందుండడానికి కారణం కాకాని వేసిన బాటే. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా బోర్డుల వ్యవస్థకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన ఘనత ఆయనదే. అలా ఇతర జిల్లాల వారికి కూడా కాకాని గారు ఆదర్శపాత్రుడు అయ్యారు. కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, అనంతపురం జిల్లాలో కల్లూరు సుబ్బారావు, ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు, గుంటూరు జిల్లాలో జాగర్లమూడి చంద్రమౌళి, విశాఖ జిల్లాలో సాగి సూర్యనారాయణరాజు, పశ్చిమగోదావరిలో మాగంటి బాపినీడు జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఎన్నికై సేవలు చేశారు. వీరంతా కాకానితో కలిసి పని చేసిన నాయకులే.
కాకాని పాలనా పద్ధతులను మనం ఇంకా కొనసాగిస్తున్నామనడం సత్యదూరం కాదు. ముందు విద్య అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండాలి. అనటమే కాకుండా, దానికోసం నిరంతర కృషిచేసిన నాయకుడు కాకాని. గ్రామ గ్రామానికి వెళ్లి పాఠశాల స్థాపన ధ్యేయంగా ఆయన తన అధికారాలను సద్వినియోగం చేశారు. ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గుర్తించడమేకాక, వారికి సమున్నతమైన గౌరవం తీసుకొచ్చిన నాయకుడు.
విద్యతోపాటు వ్యవసాయం, నీటిపారుదల, రోడ్ల నిర్మాణం, నిర్వహణ మొదలైనవి స్థానికుల కృషితోనే జరిగే విధంగా చూడడం ఆయన పాలనా పద్ధతుల విశిష్టత. వ్యవసాయంతో పాటు పాడి, మహిళా శక్తికి ఏ విధంగా తోడ్పడుతుందో అది గ్రామాభివృద్ధికి ఎంత ముఖ్యమో చెప్పి చూపించినది కూడా కాకానే. కుటుంబ వ్యవస్థలను బలపరిచే ఆలోచనలు ఎన్నో....! ముఖ్యంగా మహిళలు, పిల్లలకు రైతులలాగా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వడం గురించి చర్చించి స్థానికులే తగిన చర్యలు చేపట్టేలా చూశారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా జరగాలనేది ఆయన ఆలోచన. అలాగే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించి, దేశ సమస్యల పట్ల అవగాహన పెంపొందించడానికి పాఠశాలల్లో సోషల్ స్టడీస్ మీద, ఆటపాటల మీద ధ్యాస పెంచే ప్రయత్నం ప్రత్యేకంగా చేశారు. ప్రతి పాఠశాలలోనూ ఆటస్థలం ఉండేందుకు ఆయన కృషి చేశారు.
కాకాని వెంకట రత్నం తనను తాను ఎప్పుడూ ఒంటరివాడినని భావించుకోలేదు. ప్రజలే తన బలం అని ఆయన విశ్వసించారు. ఇది, మొట్టమొదట ప్రస్తావించవలసిన ఆయన నాయకత్వ విశిష్టత. కాకాని ఎప్పుడూ ఒక బృంద నాయకుడుగా వ్యవహరించారు. వివిధ కులాల వారందరూ కాకాని బృందంలో ఉండేవారు. వారెప్పుడూ కలసికట్టుగానే కాకానితో వ్యవహరించేవారు. ప్రజల వద్దకు ఒకటిగా వెళ్ళే వారు. వారిలో ప్రతి ఒక్కరి జీవనశైలి నిరాడంబరంగా ఉండేది. అందరూ సామాన్య నేపథ్యం నుంచి ప్రభవించిన వారే.
ఎన్నికల రాజకీయాలలో ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన భావించే వారు. ఎన్నికలలో గెలిచినా, ఓడినా నిత్యం ప్రజాహితంగా వ్యవహరించడం కాకాని నాయకత్వ రెండో విశిష్టత. శాసనసభ ఎన్నికలలో కాకాని రెండుసార్లు ఓడిపోయారు. మూడు సార్లు విజయం సాధించారు. ఎన్నికలలో గెలవడమే పరమ లక్ష్యంగా (ఇప్పటి నాయకుల వలే) ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కాకాని కృషి చేసేవారు.
క్లిష్ట పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకోవడాన్ని కాకాని ఎప్పుడూ ఉపేక్షించ లేదు. ఇది ఆయన నాయకత్వ మూడో విశిష్టత. కాకాని దృఢ సంకల్పంతో వ్యవహరించే వ్యక్తి అయినప్పటికీ భావోద్వేగాలకు లోనుకావడం ఆయన స్వతస్సిద్ధ గుణం. ఒక సారి మేము రిక్షాలో ఒక హోమియో డాక్టర్ వద్దకు వెళతున్నాం. దారి మధ్యలో హిందీ సినిమా ‘దోస్తీ’ వాల్ పోస్టర్ ఆయన్ని ఆకట్టుకుంది. ఆయన కోరిక మీద ఆ సినిమాను చూడడానికి వెళ్ళాం. ఒక అంధ యువకుడు, కుంటి వాడైన అతడి మిత్రుడి గాథే ఆ సినిమా. ఆ ఇరువురినీ సమాజం పూర్తిగా విస్మరించడం కాకానిని చాలా బాధపెట్టింది. సినిమా చూస్తున్న రెండు గంటల సేపూ ఆయన కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు అయ్యే వ్యయాలకు సామాన్య ప్రజల నుంచే అవసరమైన మేరకు నిధులు సమకూర్చుకోవడం కాకాని నాయకత్వ నాలుగో విశిష్టత. ఇప్పటి నేతల వలే కార్పొరేట్ కంపెనీలపై కాకాని ఎప్పుడూ ఆధారపడేవారు కాదు. విరాళాలు ఇచ్చిన వారు, స్వీకరించిన నేత తమ వాడని భావించాలని ఆయన విశ్వసించేవారు. అంతేగాని విరాళాలు తీసుకున్న నాయకుడు విరాళాలు ఇచ్చిన వారే తన ప్రజలు అని భావించకూడదనేది కాకాని వైఖరిగా ఉండేది. జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఏడు దశాబ్దాల క్రితమే కాకాని, జిల్లా అభివృద్ధిలో ఒక ఆదర్శప్రాయమైన ఉదాహరణను నెలకొల్పారు. ఇది ఆయన నాయకత్వ ఐదో విశిష్టత.
కుల మతాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఆత్మీయ అనుచరులను దృష్టిలో పెట్టుకుని కులాలకతీతంగా ఆయన అందరినీ కలుపుకుని పోయారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ సర్వజన నాయకుడిగా పేరు పొందారు. ప్రతి గ్రామంలోనూ వ్యక్తులతో నేరుగా వ్యక్తిగత సంబంధాలు నెలకొల్పుకోవడం కాకాని నాయకత్వ ఆరో విశిష్టత. జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి మారూమూల ప్రాంతాలలోని వారితో కూడా ఆ ఆయన సంప్రదించేవారు.
అభివృద్ధి కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములను చేసేవారు. ప్రజల సమస్యలపైనే ఆయన ఆందోళనలు నిర్వహిస్తుండేవారు. ఏ పదవిని నిర్వహించినప్పటికీ దానికొక నిర్దిష్ట గడువు ఉందనే వాస్తవాన్ని కాకాని విస్మరించేవారు కాదు. తన తరువాత ఆ పదవిలోకి వచ్చే వ్యక్తికి విధి నిర్వహణలో మార్గదర్శకాలుగా కొన్ని పూర్వ ప్రమాణాలు నెలకొల్పాలని విశ్వసించేవారు. ఇది ఆయన నాయకత్వ ఏడవ విశిష్టత. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు తన పేరు పెట్టడాన్ని కాకాని అంగీకరించేవారు కాదు. ఇది ఆయన నాయకత్వ ఎనిమిదో విశిష్టత.
ప్రజా జీవితంలో ఆయన చుట్ట పక్కాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వక పోవడం కాకాని నాయకత్వ తొమ్మిదో విశిష్టత. తన కుటుంబ సభ్యులను రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉంచారు. గ్రామాలు, గ్రామీణులు ప్రభుత్వంపై ఆధారపడకూడదనేది కాకాని దృఢ విశ్వాసం. ఇది నాయకత్వ పదో విశిష్టత. తనతో ఉండే యువజనులు అందరికీ ఈ విషయాన్ని ఆయన పదేపదే చెబుతుండేవారు.
కాకాని వ్యక్తిత్వం ప్రజాహితమైనది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు లేదా సేవలు చేసేందుకు చట్ట సభలో వారికి ప్రాతినిధ్యం వహించనవసరం లేదని కాకాని భావించేవారు. ఆ విధ్యుక్త ధర్మ నిర్వహణకు ఒక రాజకీయ పార్టీకి కార్యకర్త లేదా నాయకుడుగా ఉండవలసిన అవసరంలేదని కూడా ఆయన విశ్వసించేవారు. ఈ విశ్వాసాలను చిత్తశుద్ధితో పాటించిన ఉదాత్త నాయకుడు కాకాని వెంకట రత్నం.
మరి ఆయన చనిపోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎంతో మంది ఆయన్ని గుర్తు పెట్టుకుంటున్నారు. ఆయన ఆదర్శాలు, దూరదృష్టి అంత గొప్పవి అని చెప్పకనే చెప్పవచ్చు. ఎన్నో ఉదాహరణలు. క్లుప్తంగా కొన్ని :
1) విలువలు లేని పార్టీ రాజకీయాలు అనర్థాలన్నిటికీ మూలం అనే భావన.
2) ప్రజా సేవలో ఉన్నవాళ్లు కొన్ని నియమాలు పాటించాలి.
3) ఎన్నికల్లో గెలుపోటములకు అతీతంగా ఆలోచించడం.
4) వ్యక్తి ఆరాధన కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని నమ్మడం.
5) స్థానిక సమస్యలు, సంస్థల మీద ధ్యాస.
6) ఏ పదవిలో ఉన్నాం అనేదానికంటే తర్వాత ఆ పదవిలోకి వచ్చే వాళ్లకి ఏ విలువలు తెలియజేశాం అనేది ముఖ్యమని భావించడం.
7) ఆలోచనలు పది మందితో పంచుకుంటూ పెంచుకోవడమే ప్రజాస్వామ్యం అని నమ్మడం.
8) అధికార వికేంద్రీకరణే గ్రామాలకు శ్రీరామ రక్ష అని పదే పదే చెప్పాడు.
9) కులమతాలకి అతీతంగా ఆలోచించటమేగాక అందరితో కలిసి పనిచేయటం, అందరికి అవకాశాలు కలుగజేశాడు.
10) అడగకుండానే బడుగువర్గాలకు అండగా ఉండడం.
11) పిల్లలు, యువకుల భవిష్యత్ గురించి ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం
12) వ్యాపార లావాదేవీలు పార్టీ రాజకీయాలతో ముడిపెట్టలేదు.
13) ప్రత్యర్థులమీద వ్యక్తిగత దూషణలకి దూరంగా ఉంటే అందరికీ మంచిది అని నమ్మడం.
ప్రజా జీవితంలో కాకాని తనదైన ముద్ర వేశారు. ప్రజా హిత జీవితానికి ఒక నిదర్శనంగా నిలిచారు. గ్రామీణ ఆర్థిక జీవనంలో పెనుమార్పులకు దోహదం చేశారు. ఒక రాజకీయ నాయకుడు చేయదగ్గ ప్రజాసేవకు కాకాని కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను నెలకొల్పారు. కనుకనే ఆయన గొప్ప నాయకుడుగా చరిత్రలో నిలిచారు. కోస్తాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఆయన రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా కృషి చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ముమ్మరమయిన తరుణంలో గన్నవరం విమానాశ్రయం వద్ద ఆందోళన చేస్తున్న యువకులపై పోలీసు కాల్పులు జరిగాయన్న విషయం తెలియగానే గుండెపోటుకు గురై 1972 డిసెంబర్ 25న కాకాని వెంకటరత్నం మరణించారు. ఆయన మరణంతో ఆ ఉద్యమం క్రమంగా చల్లారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు నలభై సంవత్సరాల ముందు జరిగిన జై ఆంధ్ర ఉద్యమం తార్కిక అంతానికి చేరి ఉంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మరింత మెరుగ్గా అభివృద్ధి చెంది ఉండేవి.
కాకానిది అతి సామాన్య జీవన విధానం ఆయన ధ్యాసంతా పదిమంది పిల్లలకు, 20 మంది రైతులకు, 30 గ్రామాలకు సహాయపడటమే. ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా కాకాని కనీసం నలుగురైదుగురిని పేరు పెట్టి పిలిచేవారు. వారి కుటుంబాల మచి చెడ్డలు అడిగి తెలుసుకునేవారు. ఈ సద్గుణం, సహృద్భావమే కాకాని నాయకత్వానికి మూలాలు. కాకాని వెంకటరత్నం తిరుగులేని నాయకుడిగా, మొండిజీవిగా, ప్రజారాజకీయవాదిగా వెలుగొందడానికి కారణం. ఈనాటి రాజకీయ నేతలు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే దేశ స్థితిగతులు సత్వరమే మరింత మెరుగుపడతాయనడంలో సందేహం లేదు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







