బెంగళూరులో 40 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

- September 12, 2016 , by Maagulf
బెంగళూరులో 40 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

కావేరీ జలాల వివాదంతో బెంగళూరు నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. నిరసనకారులు మరోసారి రెచ్చిపోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. కేపీఎస్‌ బస్టాండులో ఉన్న తమిళనాడుకు చెందిన 40 ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ ఘటనలో కేటీఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన 38 బస్సులు, ఎస్‌ఆర్‌ఎస్‌కు చెందిన మరో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం నగరంలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ విధించారు. బెంగళూరులో 10 కంపెనీల సీఆర్పీఎఫ్‌, 10 కంపెనీల ఆర్‌ఏఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు 200 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు, మైసూరు, మాండ్యా ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక మంత్రి మండలి మంగళవారం అత్యవసరంగా భేటీ కానుంది.
తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈరోజు ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. బెంగళూరులో, మైసూర్‌ వెళ్లే జాతీయ రహదారిపై ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

నిరసనకారులు తమిళనాడు వాహనాలు, బస్సులను తగలబెడుతున్నారు. షాపులను ధ్వంసం చేస్తున్నారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సులను నిలిపేశారు. తమిళనాడు బస్సులను కూడా కర్ణాటకకు రానియ్యట్లేదు.

బెంగళూరులో మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com