నవ నిర్మాణదీక్ష ముగింపు..

- June 07, 2016 , by Maagulf
నవ నిర్మాణదీక్ష ముగింపు..

 రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో చేపట్టిన నవ నిర్మాణదీక్ష ముగింపు కార్యక్రమానికి చారిత్రక నగరం కడప సన్నద్ధమైంది. బుధవారం మహాసంకల్ప యాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. 3.15 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి 4 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.15 గంటల నుంచి 6 వరకు కడప మునిసిపల్‌ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై రాత్రికి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేయనున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కూడా హాజరుకానున్నారు.
బుధవారం రాత్రి కడపలోనే బస చేయనున్న సీఎం గురువారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి విమానంలో గన్నవరం వెళ్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు తదితరులతో పాటు చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌, డీజీపీ జేవీ రాముడు, పలు శాఖల ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఇప్పటికే కడప మునిసిపల్‌ మైదానంలో సభావేదికను అందంగా తీర్చిదిద్దారు. పార్టీ జెండాలు, నవనిర్మాణ దీక్ష ఫ్లెక్సీలతో అలంకరించారు. విమానాశ్రయం నుంచి సభావేదిక వరకు తోరణాలను ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ రామకృష్ణ, సమాచారశాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.భద్రత కట్టుదిట్టం : ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలు, 20 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో పహారా సాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలు నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. విమానాశ్రయం, సభావేదిక పరిసరాల్లో బాంబ్‌ స్వా్కడ్‌, డాగ్‌ స్వా్కడ్‌ తనిఖీలు ముమ్మరం చేశారు. కడపలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి విడిది చేసే ఆర్‌అండ్‌బీ అతిథిగృహం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లించారు. అడుగడుగునా పోలీసుల పహారా కనిపిస్తోంది. భద్రత పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుండటం విమర్శనాత్మకంగా మారింది.అధికారులతో సమీక్ష : సభ అనంతరం సీఎం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకోనున్నారు. ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెదేపా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలు, ముఖ్య అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రాత్రి ఇక్కడే బస చేయనున్న క్రమంలో సమీక్ష ప్రాధాన్యం సంతరించుకోనుంది. పలువురు సీఎం సమక్షంలో పార్టీలో చేరే అవకాశముందన్నట్లు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com